తెలంగాణ

telangana

ETV Bharat / state

Covid effect : ప్రవేశాలు లేవు.. పరికరాలు కరవు - covid effect on sports schools

కరోనా మహమ్మారి(Covid effect).. క్రీడా పాఠశాలలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాట్స్​ ఆధ్వర్యంలో నెలకొల్పిన 3 క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలు జరగకపోవడంతో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. మరోవైపు పరికరాల కొరత వేధిస్తోంది. కొవిడ్​ ఉద్ధృతి తగ్గితేనే వాటిపై దృష్టి సారించే పరిస్థితి నెలకొంది.

Covid effect on sports schools
క్రీడా పాఠశాలలపై కరోనా ప్రభావం

By

Published : Jul 1, 2021, 8:33 AM IST

తెలంగాణ యువతను జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్‌) ఆధ్వర్యంలో మూడు క్రీడా పాఠశాలలు నెలకొల్పారు. నాణ్యమైన చదువు, చక్కని శిక్షణ అందించడంలో అవి విఫలమవుతున్నాయి. కరోనాతో గతేడాది ప్రవేశాలు జరగకపోగా, ఈ ఏడాది ఇంకా ఎంపిక ప్రకటన కూడా జారీ చేయలేదు.

ఆదిలాబాద్​లో క్రీడా పాఠశాల

సాట్స్‌లో ప్రవేశాల ప్రకటనేదీ?

రాష్ట్రంలో ఆదిలాబాద్‌, హకీంపేట, కరీంనగర్‌ ప్రాంతాల్లో క్రీడా పాఠశాలలు ఉన్నాయి. ఏటా ఏప్రిల్‌లో నాలుగో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన ఇస్తారు. మే నెలలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం హకీంపేటలో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు పెడుతున్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను మూడు క్రీడా పాఠశాలలకు ఎంపిక చేస్తారు. ఒక్కో క్రీడా పాఠశాలకు 20 మంది బాలికలు, 20 మంది బాలురు చొప్పున సీట్లు కేటాయిస్తారు. జూన్‌ నెల ముగిసిపోతున్నా నేటికీ ప్రవేశాల ప్రకటన జాడ లేదు.

సమకూరని ఆట పరికరాలు

1993లో హకీంపేట, 2006లో కరీంనగర్‌, 2016లో ఆదిలాబాద్‌ క్రీడా పాఠశాలలను కోట్ల రూపాయల నిధులతో ప్రారంభించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా క్రీడా శిక్షకులను నియమించలేదు. ఆట పరికరాలు సమకూర్చలేదు. ఫలితంగా విద్యార్థులు వ్యాయామ సాధనకే పరిమితమయ్యారు. ఆదిలాబాద్‌ పాఠశాలకు చెందిన అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, జూడో శిక్షకులు సొంత డబ్బుతో కొన్ని క్రీడా పరికరాలు తెప్పించి వాటితోనే సాధన చేయిస్తున్నారు.

పాఠశాలలు ప్రారంభమైతేనే ప్రవేశాల ప్రకటన

కరోనా కారణంగా(Covid effect)అన్ని పాఠశాలలు, క్రీడా పాఠశాలలు, వసతి గృహాలు మూసి ఉన్నాయి. అవి తెరుచుకుంటేనే క్రీడా పాఠశాలలకు ప్రవేశాల ప్రకటన జారీచేస్తాం. కొవిడ్‌ ఉద్ధృతి పూర్తిగా తగ్గితే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తాం. జులై 1 నుంచి పిల్లలకు ఆన్‌లైన్‌లో బోధన ఉంటుంది. కొత్తగా బడ్జెట్‌ విడుదలైతే సాట్స్‌ ఆధ్వర్యంలో నడిచే క్రీడా పాఠశాలలకు, సంస్థలకు ఆట పరికరాలు పంపిణీ చేస్తాం. అవసరం ఉన్నచోట క్రీడా శిక్షకులను నియమించే విషయంపై చర్చిస్తున్నాం.

- ధనలక్ష్మి, సాట్స్‌ డీడీ

ఇదీ చదవండి:KTR: రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యం : కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details