రాష్ట్రంలో నాణ్యమైన పత్తికి ప్రసిద్ధిపొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ల ప్రక్రియ అంతర్మథనంలో పడింది. ఈనెల 12న రాష్ట్రమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈనెల 19 నుంచి పత్తి కొనుగోళ్లకు సీసీఐ ముందుకొచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 9.18లక్షల ఎకరాల్లో పత్తి సాగైందనీ, దాదాపుగా 1.16కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనావేసింది. దానికి అనుగుణంగా ఉమ్మడి జిల్లాలో 24 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సీసీఐ ముందుకురావడం రైతుల్లో ఆశలు చిగురింప చేసింది. హైదరాబాద్ స్థాయిలో రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో కంప్యూటరీకరించడమే మిగిలింది.
పత్తి కొనుగోళ్లు ఆలస్యం.. ఆందోళనలో అన్నదాతలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈనెల 19నుంచి ప్రారంభం కావాల్సిన పత్తి కొనుగోళ్లకు బ్రేక్‌పడింది. రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల పత్తిలో తేమశాతం పెరిగింది. రైతుల వివరాలు, ఆన్‌లైన్ కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తికాకపోవడం వల్ల కొనుగోళ్లకు అవరోధం ఏర్పడింది. తిరిగి కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిస్తారనేది తేల్చి చెప్పకపోవడం రైతుల్లో ఆందోళనకు దారితీస్తోంది.
తాజాగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో ఆన్‌లైన్‌లో రైతుల వివరాలు నమోదు పూర్తి కాలేదు. మరోపక్క పత్తి తడిసినందున తేమశాతం అధికంగా వస్తుందనే కారణంతో సీసీఐ కొనుగోళ్లకు మునుపటి ఆసక్తి చూపడంలేదు . ఫలితంగా తొలుత ఈనెల 19న ఆదిలాబాద్ మార్కెట్‌యార్డు కేంద్రంగా ప్రారంభం కావాల్సిన పత్తి కొనుగోళ్ల ప్రక్రియను వాయిదా వేయాల్సి వచ్చింది. జిల్లాలో ఇప్పటికే ఇంటికి తెచ్చుకుంటున్న పత్తినిల్వలను రైతులు గత్యంతరంలేక ఆరుబయట ఆరబెట్టుకోవాల్సి వస్తోంది. కొనుగోళ్ల కోసం అధికార యంత్రాంగం తదుపరి తేదీని ప్రకటించకపోవడం ఆందోళన చెందాల్సి వస్తోంది.