ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభించగా వందల సంఖ్యలో రైతులు పత్తి విక్రయానికి వచ్చారు. కొంతమంది ఒక రోజు మందే వచ్చి నిరీక్షించారు. ఉదయం కొనుగోళ్లు ప్రారంభించిన తరువాత ముందుగా ఉన్న వాహనాలను తూకం వేసి జిన్నింగ్‌ల్లోకి పంపించారు. అక్కడ తూకం వేయగా మార్కెట్‌లో తూకానికి, జిన్నింగ్‌లో వేసిన తూకానికి నాలుగైదు క్వింటాళ్ల తేడా రావడం వల్ల వాహనాలు వెనక్కి వచ్చాయి. తూకంలో తేడా రావడం, ఇతర కాంటాల్లోనే సాంకేతిక సమస్య ఏర్పడటం, సంగణకాలు, ప్రింటర్లు తదితర సామగ్రి దెబ్బతినగా కొనుగోళ్లను నిలిపివేశారు.
రైతుల ఆందోళన
తూకంలో తేడా రావడం, కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ అధికారుల తీరుపై మండిపడ్డారు. విద్యుత్తు అంతరాయంతో మార్కెట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన జనరేటర్‌ను ఆన్ చేయడంతో సాంకేతిక సమస్య ఏర్పడి ఒక్కసారిగా కాంటాల్లో ఉండే తీగలు, ఇతర సామగ్రి దెబ్బతినడంతో తూకంలో తేడా వచ్చిందని అధికారులు తెలిపారు. ఇతర కాంటాల్లో ఏర్పాటు చేసిన సంగణకాలు, ప్రింటర్లు ఇతర సామగ్రి కూడా కొంత దెబ్బతినడంతో కొంతసేపు తూకం నిలిపివేశారు. మొత్తం సరిచేసి, మధ్యాహ్నం మళ్లీ ప్రారంభించారు.