Cotton Farmers Concern of is cotton price has decreased: భారత పత్తి సంస్థగా పేరొందిన సీసీఐ వాణిజ్య కొనుగోళ్లకు ముందుకొచ్చినా రైతులకు మేలు జరగడంలేదు. సీసీఐ రంగంలోకి దిగితే ధర పెరుగుతుందని ఆశించిన రైతులకు రెండు రోజులుగా నిరాశనే ఎదురవుతోంది. వ్యాపారులతో కలిసి వేలంపాటలో పాల్గొన్న అధికారులు తొలిరోజు క్వింటాలుకు 8వేల పది రూపాయలు ధర నిర్ణయించగా.. రెండో రోజూ అదే ధరను నిర్ణయించారు. సీసీఐ నిబంధనలకు తోడు ధర తక్కువగా నిర్ణయించడంతో రైతులంతా వ్యాపారులకే పత్తిని విక్రయిస్తున్నారు.
గత 15 రోజుల వ్యవధిలో క్వింటాలుకు వెయ్యి రూపాయలు తగ్గించిన వ్యాపారులు.. సీసీఐ రాకతో ధరను పెంచుతారని రైతులంతా భావించారు. కానీ అదీ జరగలేదు. సీసీఐ అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై ధర విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికారులు మాత్రం వారం రోజులుగా ధరలు తగ్గుముఖం పడుతున్నా.. మిగిలిన మార్కెట్లతో పోల్చితే ఆదిలాబాద్‌లో ధర ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
"ఈ రోజు సీసీఐ రంగంలోకి వచ్చిందని పత్తి అమ్మడానికి వచ్చాను. నిన్న ఉన్న పత్తి ధర రూ.8100 ఉంటే నేడు రూ.90 తగ్గి రూ.8010కు చేరుకుంది. సీసీఐ వచ్చింది మేలు చేస్తోంది అనుకుంటే అదీలేదు. నాడు ఆకాల వర్షాలతో రైతు నీట మునిగితే.. నేడు పత్తి గిట్టుబాటు ధర రాక ఇలా మునిగిపోయాడు. సీసీఐ మీద నమ్మకంతో వచ్చిన తమకి ప్రైవేట్ వారిని నమ్మాలో తెలియడం లేదు.. సీసీఐను నమ్మాలో తెలియడం లేదు." - స్వామి, పిప్పల్‌కోటి, రైతు