తెలంగాణ

telangana

ETV Bharat / state

cotton farmers problems: పత్తి రైతుకు దుఃఖం... ధర బావున్నా పడిపోయిన దిగుబడి - తెలంగాణ వార్తలు

cotton farmers problems: రాష్ట్రంలో తెల్ల బంగారం దిగుబడి నిరాశాజనకంగా ఉంది. మార్కెట్లో ధర భారీగా పలుకుతున్నప్పటికీ.. దిగుబడి లేక రైతులు దిగాలుగా ఉన్నారు. అంతుచిక్కని తెగుళ్లు, వర్షాలు రైతులను దెబ్బతీశాయి. దీంతో అనుకున్నంత దిగుబడి లేక పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.

cotton farmers problems
cotton farmers problems

By

Published : Dec 3, 2021, 8:20 AM IST

cotton farmers problems: రాష్ట్రంలో పత్తి పంట దిగుబడి నిరాశాజనకంగా ఉంది. మార్కెట్లో ధర భారీగా పలుకుతున్నా.. వర్షాలు, తెగుళ్లు రైతులను దెబ్బతీశాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా ధర రూ.8 వేలకు పైగా ఉంది. కానీ దిగుబడి లేక రైతులు దిగాలుగా ఉన్నారు. రాష్ట్రంలో పత్తి పంట దిగుబడి నిరాశాజనకంగా ఉంది. మార్కెట్లో ధర భారీగా పలుకుతున్నా.. వర్షాలు, తెగుళ్లు రైతులను దెబ్బతీశాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా ధర రూ.8 వేలకు పైగా ఉంది. కానీ దిగుబడి లేక రైతులు దిగాలుగా ఉన్నారు. ఈ ఏడాది మొత్తం 46.50 లక్షల ఎకరాల్లో పంట సాగైతే దిగుబడి 31 లక్షల టన్నులొస్తుందని అర్ధ, గణాంక, మార్కెటింగ్‌ శాఖ తొలుత అంచనా వేసింది. ఇప్పటివరకూ అందులో 10 శాతం అంటే 3.10 లక్షల టన్నులు మాత్రమే మార్కెట్లకు వచ్చింది. గతేడాది ఈ సమయానికి 5.69 లక్షల టన్నుల పత్తి పంట మార్కెట్లకు వస్తే ఈ ఏడాది అందులో 55 శాతంలోపే మార్కెట్లకు రావడం గమనార్హం.

దెబ్బతీసిన వాతావరణం..

రాష్ట్రంలో పత్తి పంటకు ప్రస్తుత వాతావరణం శాపంగా మారింది. జూన్‌ 5న నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించగా.. పలు ప్రాంతాల్లో రైతులు పెద్దఎత్తున పత్తి విత్తనాలు నాటారు. అదే నెలలో వర్షాలు మొదలై ఆగస్టు రెండోవారం వరకు ఏకధాటిగా కురిశాయి. అధిక తేమ కారణంగా పత్తి మొక్కలు చనిపోయాయి. మళ్లీ రైతులు విత్తనాలు నాటారు. తొలకరి ముందుగా రావడంతో పత్తి సాగు విస్తీర్ణం 75 లక్షల ఎకరాలకు చేరుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసినా.. అధిక వర్షాలతో 46.50 లక్షల ఎకరాలకే పరిమితమైంది. తెలంగాణలో దిగుబడి 30 లక్షల బేళ్లకు మించి రాకపోవచ్చని.. గతేడాది 44 లక్షల బేళ్లు వచ్చిందని రాష్ట్ర జిన్నింగ్‌ మిల్లుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.రమేశ్‌ ‘ఈనాడు’కు చెప్పారు. వర్షాలు రైతులను బాగా దెబ్బతీశాయని మార్కెటింగ్‌శాఖ రాష్ట్ర సంచాలకురాలు లక్ష్మీబాయి చెప్పారు. రాష్ట్రంలో పెద్దదైన ఖమ్మం మార్కెట్‌కు గతేడాది ఈ సమయానికి 2,02,358 క్వింటాళ్ల పత్తిని రైతులు తీసుకురాగా.., ఈసారి ఇప్పటికి 1,35,770 క్వింటాళ్లే వచ్చిందని ఖమ్మం మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి మల్లేశం తెలిపారు.

సాగు ఖర్చులు కూడా రాలేదు..

వర్షాలు, తెగుళ్ల కారణంగా ఎకరానికి 2 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చిందని ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన సీతారం తెలిపారు. ప్రైవేటు అప్పులు తెచ్చి పంట సాగుకు పెట్టుబడులు పెడితే చివరికి ఖర్చులు కూడా తిరిగి రాలేదని వాపోయారు.

దేశంలో పరిస్థితి ఇదీ...

ఈ ఏడాది దేశంలో 3.60 కోట్ల బేళ్ల పత్తి దిగుబడి వస్తుందని భారత పత్తి వ్యాపారుల సంఘం అంచనా. గతేడాది వచ్చిన 3.53 కోట్ల బేళ్లకన్నా ఈసారి మరో 7 లక్షల బేళ్లు అదనం. (170 కిలోల దూదిని బేలు అంటారు). గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాలలో పత్తి పంట బాగుందని వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది 16 లక్షల బేళ్లు రాగా.. ఈ ఏడాది 14 లక్షల బేళ్లు రానున్నాయి.

ఇదీ చదవండి:KOMATI REDDY ON PADDY: 'వానాకాలం పంట కొనకుండా యాసంగి కోసం పోరాటమా?'

ABOUT THE AUTHOR

...view details