తెలంగాణ

telangana

ETV Bharat / state

పత్తిసాగు: ఓవైపు గులాబీ రంగు పురుగు... మరోవైపు కాయకుళ్లు తెగులు

నాణ్యమైన పత్తి సాగుకు ఖ్యాతిగాంచిన ఆదిలాబాద్‌ జిల్లాలో మరో ముప్పు వాటిల్లింది. ఇప్పటికే గులాబీరంగు పురుగు దాడితో కుళ్లిపోతున్న పంటను ఇప్పుడు కాయ కుళ్లు తెగులు వ్యాపిస్తోంది. ఫలితంగా దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టబడి రెట్టింపు అయ్యిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

cotton-crop-farmers-losses-heavily-in-adilabad-district
పత్తిసాగు: ఓవైపు గులాబీ రంగు పురుగు... మరోవైపు కాయకుళ్లు తెగులు

By

Published : Oct 30, 2020, 1:06 PM IST

పత్తిసాగు: ఓవైపు గులాబీ రంగు పురుగు... మరోవైపు కాయకుళ్లు తెగులు

తెల్లబంగారంగా పేరొందిన పత్తిసాగును పెంచాలనే ప్రభుత్వ సూచనతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ ఏడాది దాదాపుగా 9.17లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఖరీఫ్‌ ఆరంభంలో తీవ్ర వర్షాభావం కారణంగా ఒకటికి రెండు సార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది. ఫలితంగా సగటున ఎకరాకు రూ.10వేలు పెట్టుబడి రూ.20వేలకు పెరిగింది. మధ్యలో అకాలవర్షాలు ఏకధాటిగా కురవడంతో ఏపుగా ఎదిగిన పంటకు అవరోధం ఏర్పడింది. మరోవైపు గులాబీరంగు పురుగు దాడిచేసి పత్తికాయలను తొలిచేస్తోంది. ప్రస్తుతం కాయకుళ్లు తెగులు ఆవరించడం రైతులను కలవరానికి గురిచేస్తోంది

పత్తి రైతుల ఆందోళన

ఆదిలాబాద్‌, కుమురంభీం, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఎర్రనేలల్లో సాగైన పత్తి ఇప్పటికే చేతికిరాగా... నల్లరేగడి నేలల్లో పండిన పంట దీపావళి నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం గులాబీరంగు పురుగుతోపాటు కాయ కుళ్లు తెగులు ఆవరించడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు వాపోతున్నారు. మొక్కలు ఏపుగా పెరిగి పంట బాగున్నట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ పత్తికాయలను లోపలి నుంచి పురుగులు తినేస్తుండడం... రైతుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఎకరాకు పది క్వింటాళ్లు రావాల్సిన చోట మూడు క్వింటాళ్లు వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నష్టం ఉంటుందంటున్న వ్యవసాయశాస్త్రవేత్తలు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గతంలో పత్తితో పాటు దాదాపుగా లక్షా 90వేల ఎకరాల్లో సోయా పంట సాగయ్యేది. కానీ ఈ ఏడాది ప్రభుత్వ సూచనతో పత్తిని ఎక్కువగా సాగు చేశామని రైతులు అంటున్నారు. ఫలితంగా సోయా సాగు లక్షా 40వేల ఎకరాలు తగ్గింది. తాజాగా పత్తి నాణ్యతపై పురుగు ప్రభావం చూపుతుండటంతో కేంద్రం ప్రకటించిన మద్ధతు ధర రూ.5,825 దక్కదనే ఆందోళన రైతులను వెంటాడుతోంది. సస్యరక్షణ పద్ధతులు చేపట్టనట్లయితే రైతులకు నష్టం తప్పదని వ్యవసాయశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మద్దతు ధర అవసరం

ప్రకృతి వైపరీత్యాలు, చీడపురుగుల బెడదతో అనుకున్నదానికంటే ఎక్కువగా నష్టపోయిన రైతులకు మద్దతు ధర ఇవ్వాలని నిపుణులు కోరుతున్నారు. అన్నదాతలు అధైర్యపడకుండా భవిష్యత్తులో కాస్తంత భరోసా ఇచ్చినట్లవుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:భారీ వర్షాలు మిగిల్చేను పత్తి రైతుకు కష్టాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details