ఆదిలాబాద్ జిల్లాలో కరోనా వైరస్ ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. కంటికి కనిపించని శత్రువుతో చేస్తున్న యుద్ధంలో ముందుండి పోరాడుతున్న వైద్యులు కొవిడ్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల పలువురు స్టాఫ్‌నర్సులు వైరస్‌బారిన పడగా తాజాగా రిమ్స్‌లో హౌజ్ సర్జన్ల (జూనియర్ వైద్యుల)కు మహమ్మారి సోకింది. ఎనిమిది మంది జూనియర్ వైద్యులకు కరోనా నిర్ధారణ కాగా వారి ప్రైమరీ కాంటాక్టులుగా ఉన్న మరో 50 మంది వరకు జూనియర్ వైద్యులను అనుమానితులుగా భావించి మంగళవారం నమూనాలను సేకరించారు. వారి ఫలితాలు బుధవారం వెలువడే అవకాశం ఉంది. నివేదికలు వచ్చే వరకు వీరంతా క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.
సేవల్లో అంతరాయం
రోగులకు సేవలు అందించడంలో ప్రధాన పాత్ర జూనియర్ వైద్యులదే. సీనియర్ వైద్యులు ఆసుపత్రిలోని రోగులను పరీక్షించి వారికి అందించాల్సిన చికిత్స గురించి సూచనలు చేస్తారు. ఈ సూచనల మేరకు జూనియర్ వైద్యులు బాధితులకు వైద్యం అందిస్తుంటారు. మధ్యాహ్నం అనంతరం సీనియర్ వైద్యులు ఎవరూ దాదాపు అందుబాటులో ఉండరు. ఈ సమయంలో బాధితుల పరిస్థితి విషమంగా మారితే పరిస్థితిని బట్టి జూడాలే వైద్యం అందిస్తుంటారు. అత్యవసర సమయంలో చరవాణిలో సీనియర్ వైద్యులను సంప్రదించి అప్పటికప్పుడు బాధితులకు వైద్యం అందిస్తుంటారు. కాగా ఆసుపత్రిలోని మొత్తం 100 మంది జూనియర్ వైద్యుల్లో ఎనిమిది మందికి పాజిటివ్ నిర్ధారణ కావడం, మరో 50 మంది నమూనాలు ఇచ్చి క్వారంటైన్‌కు వెళ్లడం.. మరికొందరు విధులు నిర్వహించడానికి విముఖత చూపుతుండటంతో వైద్యసేవల్లో అంతరాయం ఏర్పడింది. పలు వార్డుల్లో బాధితులకు కేవలం స్టాఫ్ నర్సులే దిక్కయ్యారు.