తెలంగాణ

telangana

ETV Bharat / state

అయోమయం.. తొలగని భయం - CORONA CASES IN ADILABAD

ఆదిలాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం జిల్లా వాసులను ఆందోళనలో పడేసింది. కేవలం శుక్రవారం ఒక్క రోజే మూడు కేసులు నమోదు కావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.

CORONA CASES IN ADILABAD
అయోమయం.. తొలగని భయం

By

Published : Apr 19, 2020, 12:03 PM IST

ఆదిలాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం అధికార యంత్రాంగం, జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదివరకే జిల్లా వ్యాప్తంగా 11 మంది బాధితులు వైరస్‌ బారిన పడి హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం మరో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకిందని నిర్ధరణ కావడంతో వారిని అర్ధరాత్రి గాంధీకి పంపించారు. వారి కుటుంబీకుల్లో 16 మందిని శుక్రవారం రాత్రి అధికారులుప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు.

శనివారం మరో అయిదుగురు కుటుంబ సభ్యులను అదే క్వారంటైన్‌ గృహంలో చేర్చారు. పాజిటివ్‌ వ్యక్తులను కలసిన బయటి వారిని గుర్తించిన ఇంటలిజెన్స్ వర్గాలు పాలనాధికారికి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా రెవెన్యూ అధికారులు ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన మరో 24 మందిని కూడా క్వారంటైన్‌ గృహానికి తరలించారు. బాధితుల బంధువులతో పాటు ఇతర వ్యక్తులు కలిసి మొత్తం 45 మంది క్వారంటైన్‌లో ఉండగా.. వారందరి రక్తనమూనాలను సేకరించి పరీక్ష నిమిత్తం హైదరాబాద్‌కు పంపించారు. ఇపుడు ఆ పరీక్షల నివేదికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మొన్నటి వరకు కేవలం దిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారికి, వారి రక్తసంబంధీకుల్లో ఒకరికి మాత్రమే కరోనా వైరస్‌ సోకడంతో బయట వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం లేదని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ తరుణంలో మర్కజ్‌ యాత్రికులు కాకుండా వారిని కలిసిన బయట వ్యక్తులు బాధితులుగా తేలడం అధికార వర్గాలను.. జిల్లా వాసులను కలవరపెడుతోంది. ఒకవేళ వీరిలోనూ కరోనా లక్షణాలు కనిపిస్తే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుందనే భయం అందరిని వెంటాడుతోంది. తాజాగా వైరస్‌ సోకిన వారు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పండ్ల వ్యాపారం చేయడం.. వచ్చి పోయే వారు.. వారివద్ద ఎంతమంది ఆ పండ్లను కొనుగోలు చేశారనేది తెలుసుకోవడం ఇంటెలిజెన్స్ వర్గాలకు తలనొప్పిగా మారే ప్రమాదముంది. రక్తనమూనాలు సేకరించిన వారంతా ప్రస్తుతం బాధితులు తేలిన వారికి సన్నిహితంగా మెదిలిన వారు కావడంతో వారి సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలు తేలిగ్గా సేకరించగలిగాయి. అదే వైరస్‌ బాధితుల నుంచి పండ్లు కొనుగోలు చేసిన వారి లెక్క తేలాలంటే మాత్రం కొనుగోలుదారులే స్వయంగా స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

నిత్యావసరాలకు మరింత సడలింపు

ఇదివరకు కంటైన్మెంట్ ప్రాంతాల్లో తప్ప ఇతర ప్రాంతాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే నిత్యావసర సరకులు తీసుకోవాలనే నిబంధన అమల్లో ఉండేది. ఇపుడా నిబంధనను మార్పు చేస్తూ ఉదయం 6 గంటల నుంచి సరకులు తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ పాలనాధికారి శ్రీదేవసేన ఉత్తర్వులు జారీచేశారు. అయితే కంటైన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో దుకాణాలు, ఇతర కార్యాలయాలు తెరవద్దని స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని 19 వార్డులతో పాటు నేరడిగొండలో ఐదు గ్రామాలు, ఉట్నూరు మండలంలో మూడు గ్రామాల్లో కంటైన్మైంట్ జోన్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ జోన్ల పరిధిలో ఏ అవసరమున్నా ప్రత్యేకాధికారులు, గల్లీ వారియర్లు ఆయా ప్రాంత ప్రజల అవసరాలను తీర్చేలా చర్యలు తీసుకోనున్నారు.

ఇవీ చూడండి:సడలింపులు ఇవ్వాలా.. వద్దా.. నేడు కేబినెట్ భేటీ​

ABOUT THE AUTHOR

...view details