తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా కల్లోలం.. ఇప్పటివరకు 114 మంది మృతి - adilabad rims hospital latest news

ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వైరస్‌ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు బాధితులకు చికిత్స అందిస్తున్న రిమ్స్‌ ఆసుపత్రిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వ్యాధిగ్రస్థుల పాలిట ప్రాణ సంకటంగా మారుతోంది.

adilabad corona news
adilabad corona news

By

Published : Apr 23, 2021, 6:59 PM IST

ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా వైరస్‌ మృత్యుఘంటికలు మోగిస్తోంది. రిమ్స్‌ ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డు రోగుల ఆర్తనాదాల కేంద్రంగా మారుతోంది. వ్యాధిగ్రస్థుల ప్రాణాలకు భరోసా ఇవ్వలేకపోతోంది. ఓవైపు ఇంజక్షన్ల కృత్రిమ కొరత, మరోవైపు మౌలిక వసతుల కల్పన లేకపోవడంతో వైరస్ బాధితులతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది ప్రాణాలకూ పరీక్షగా మారింది. రిమ్స్‌లో గత ఏడాది జులై 30న తొలి కరోనా మరణం చోటుచేసుకుంది. అప్పటి నుంచి నేటి వరకు 114 మంది మరణించడం వ్యాధి తీవ్రతను వెల్లడిస్తోంది.

రిమ్స్‌ ఆసుపత్రిలో కరోనా చికిత్స కోసం గతేడాది ప్రభుత్వం మూడు వార్డులను ఏర్పాటు చేసింది. ఇందులో కరోనా అనుమానితులను ఉంచడానికి ఒక వార్డు, వ్యాధి సోకిన వారికోసం మరో వార్డు, అత్యవసరంగా ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ అందించే వారికోసం మరో వార్డు ఏర్పాటు చేసింది. ఈ వార్డుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా 157 మంది వైద్య సిబ్బందిని నియమించారు. కానీ ఈ ఏడాది బాధితులందరినీ ఒకే వార్డులో ఉంచుతున్నారు. ఓ పది మంది వైద్య సిబ్బంది పర్యవేక్షణలోనే రోగుల బాగోగులను చూడటంతో సమస్య ఉత్పన్నమవుతోంది. ఇది చాలదన్నట్లుగా అత్యవసరమైన రోగులకు సైతం రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, వైద్యులు, వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్లు, గ్లౌజుల పంపిణీ జరగడం లేదు. ఫలితంగా కొవిడ్‌ విధుల నిర్వహణ అంటేనే వైద్యులు, వైద్య సిబ్బందిలో వణుకుపుడుతోంది.

సమన్వయలోపం..

రిమ్స్‌ ఆసుపత్రిలోనే ఇప్పటి వరకు 114 మంది కరోనాతో మృత్యువాతపడితే.. జిల్లావ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 57 మందిగానే అధికార యంత్రాంగం ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది. వైద్యారోగ్యశాఖ, రిమ్స్‌ యాజమాన్యం మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా పాలనాధికారిగా ఉన్న సిక్తా పట్నాయక్‌ రెండు నెలల పాటు వ్యక్తిగత సెలవుపై వెళ్లగా.. ఆమె స్థానంలో కుమురం భీం జిల్లా పాలనాధికారికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఫలితంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ సరిగా లేక కరోనా వ్యాధిగ్రస్థులకు ప్రాణ సంకటంగా మారుతోంది.

ఇదీ చూడండి: కరీంనగర్​లో కరోనా కలవరం.. మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details