ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ కరోనా పడగ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ కరోనా వ్యాధి విజృంభిస్తోంది. జిల్లాకు సరిహద్దున మూడు వైపుల మహారాష్ట్ర ఆనుకొని ఉంది. కరోనా లాక్‌డౌన్ సడలింపుల అనంతరం అక్కడి నుంచి రాకపోకలపై నియంత్రణను అధికారులు ఎత్తివేశారు. తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్, యావత్‌మాల్, అమరావతి జిల్లాల్లో మళ్లీ కరోనా తీవ్రత పెరిగింది. అక్కడి నుంచి ఆదిలాబాద్ జిల్లాకు సాధారణ రాకపోకలు జరుగుతుండటంతో వ్యాధి తీవ్రత పెరిగినట్లుగా అధికారయంత్రాంగం భావిస్తోంది.
విద్యార్థులకు...
మంచిర్యాలలోని ప్రభుత్వ బాలికలు ఉన్నత పాఠశాలలో రెండ్రోజుల వ్యవధిలోనే 29 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. నిర్మల్ జిల్లా భైంసాలోని జ్యోతిబాపులే బాలుర గురుకులంలో 176 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా ఏకంగా 25 మందికి వైరస్ నిర్ధరణ అయింది. ఆదిలాబాద్‌లో జిల్లాలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన పరీక్షల్లో 28 మంది విద్యార్థులతోపాటు మరో 17 మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ అని తేలింది.
ముందు జాగ్రత్త చర్యలు...
వ్యాధి తీవ్రత పెరుగుతుండటంతో అప్రమత్తమైన విద్యాశాఖ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ప్రతి పాఠశాలలో స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించడం, మాస్కులు తప్పనిసరిచేయడం, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నప్పటికీ వ్యాధి తీవ్రత పెరుగుతూనే ఉంది. ఫలితంగా పిల్లలను బడికి పంపించడానికి తల్లితండ్రులూ వెనుకడుగు వేస్తున్నారు.
వైద్యశాఖ అప్రమత్తం...
కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో విద్య, వైద్యశాఖలు అప్రమత్తమయ్యాయి. విద్యార్థులు బడికిరావడం తప్పనిసరికాదనే అభిప్రాయం విద్యాశాఖ అధికార వర్గాల నుంచి వెల్లడవుతుండగా... ముందు జాగ్రత్త చర్యలే నియంత్రణకు మార్గమనే అభిప్రాయం వైద్యశాఖవర్గాల నుంచి వినిపిస్తోంది.
మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని మండలాలు, గ్రామాల మధ్య రాకపోకలను నియంత్రణ చేయాలా..? వద్దా? అనేదానిపై అధికారవర్గాల్లో తర్జనభర్జన కొనసాగుతోంది. ప్రస్తుతం క్లిష్టపరిస్థితిని ప్రభుత్వానికి నివేదించడం ప్రాధాన్యతాంశంగా మారింది.
ఇదీ చూడండి :82 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పాజిటివ్