తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాసలో బహిర్గతమైన వర్గ విభేదాలు.. అధికారుల తీరుపై విమర్శలు

Adilabad ZP Meeting: ఆదిలాబాద్‌ జిల్లాలో అధికార తెరాసలో నెలకొన్న విబేధాలు జడ్పీ సమావేశంలో బహిర్గతమయ్యాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీపీల మధ్య అంతర్గతంగా రాజుకున్న విబేధాలతో ఎవరికి వారు అధికారుల తీరును తప్పుబడుతూ వాకౌట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. సభలో ఉన్న మరో ఎమ్మెల్యే సైతం అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ZP Meeting
తెరాసలో బహిర్గతమైన విభేదాలు.. అధికారుల తీరుపై విమర్శలు

By

Published : Apr 9, 2022, 9:39 PM IST

Adilabad ZP Meeting: ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటకొచ్చాయి. జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్‌ అధ్యక్షతన జరిగిన సర్వసభ్యసమావేశంలో ప్రజాప్రతినిధులు అధికారులే లక్ష్యంగా విమర్శలు చేశారు. సమావేశం ప్రారంభంలోనే బోథ్‌ ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావు ఉపాధిహామీ అవకతవకలపై నివేదిక ఇవ్వడంలో కలెక్టర్‌ తాత్సారం చేస్తున్నారంటూ ఆరోపించారు. సమాచారం అడిగినా ఇవ్వడం లేదంటూ సభను వాకౌట్‌ చేశారు. అదే సభలో ఉన్న ఎమ్మెల్యే జోగు రామన్న నచ్చ జెప్పినా ఆయన వినిపించుకోకుండా వెళ్లిపోయారు.

సమావేశంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు

ఎంపీడీవోపై అకారణంగా వేటు వేశారని బోథ్‌ మండల ఎంపీపీ తుల శ్రీనివాస్‌ ఆరోపించారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గి సస్పెన్షన్‌ చేశారని పరోక్షంగా అధికార పార్టీ ఎమ్మెల్యే తీరును ఎండగట్టారు. ఎంపీడీవో సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఎంపీపీ పట్టుబట్టారు. ఈ విషయంలో కలెక్టర్‌ సమాధానం ఇస్తూ పూర్తి విచారణ తర్వాతే చర్యలు తీసుకున్నామని తెలిపారు. దీంతో ఎంపీపీ ఆ సమాధానానికి సంతృప్తి చెందకుండా తొలుత పోడియం వద్ద బైఠాయించి ఆ తర్వాత సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. బోథ్‌లో జరిగిన సామాజిక తనిఖీల విషయాన్ని ప్రస్తావిస్తూ మరుగుదొడ్ల వినియోగంపై కేంద్ర బృందం వచ్చి విచారణ చేసిందని డీఆర్‌డీవో కిషన్‌ పేర్కొన్నారు. కేంద్ర బృందం వచ్చి చెబితేగానీ అధికారులు తేరుకోవడం లేదని ఎమ్మెల్యే జోగు రామన్న విమర్శించారు. అసలు జిల్లా అధికారులు పని చేస్తున్నారా లేదా అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రజాప్రతినిధుల ప్రశ్నలకు స్పందించిన కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ నిబంధనల మేరకే అధికారులపై చర్యలు తీసుకున్నామని వివరణ ఇచ్చారు. రెండేళ్లుగా తాను ఎవరిపైనా అకారణంగా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ప్రజాసమస్యలను ప్రస్తావించాల్సింది పోయి తమ ప్రాబల్యం కోసం అధికారపార్టీ వారే జడ్పీ సమావేశాన్ని వేదికగా చేసుకుని విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. సభను వాకౌట్‌ చేస్తూ సమయాన్ని వృథా చేయడం విమర్శలకు తావిచ్చింది.

ఇదీ చూడండి:మున్సిపల్ ఛైర్​పర్సన్​కు తప్పని వేధింపులు.. ర్యాలీలో చీర జారేలా..

ABOUT THE AUTHOR

...view details