తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంద్రవెల్లి స్ఫూర్తితో గడీల పాలనను పారదోలుదాం: రేవంత్ రెడ్డి - revanth reddy in congress dalit, tribal dandora sabha

కాంగ్రెస్​ దళిత, గిరిజన దండోరా సభలో సీఎం కేసీఆర్​పై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్​ రెడ్డి ధ్వజమెత్తారు. స్వేచ్ఛ కోసం పోరాడి, ప్రాణాలు ఇచ్చిన నేల ఇంద్రవెల్లి అని రేవంత్​ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్‌కూ అన్యాయం జరిగిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ఖజానాను సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. అడవిని నమ్ముకున్న గిరిజనులను పోలీసులతో కొట్టిస్తున్నారని భట్టి ఆరోపించారు.

clp-leader-bhatti-vikramarka-comments-on-cm-kcr-in-indravelli
clp-leader-bhatti-vikramarka-comments-on-cm-kcr-in-indravelli

By

Published : Aug 9, 2021, 6:08 PM IST

Updated : Aug 9, 2021, 7:45 PM IST

ఇంద్రవెల్లి పేరు స్మరిస్తే ఎంతో స్ఫూర్తి రగులుతుందని టీపీసీసీ చీప్​ రేవంత్​ రెడ్డి అన్నారు. స్వేచ్ఛ కోసం పోరాడి, ప్రాణాలు ఇచ్చిన నేల ఇంద్రవెల్లి అని ఆయన గుర్తు చేశారు. నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుమురం భీం పోరాడారని రేవంత్​ స్పష్టం చేశారు. ఒకప్పుడు ఆదిలాబాద్‌ పేరు చెపితే పోరాట యోధులు గుర్తుకు వచ్చేవారని... ఇప్పుడేమో కేసీఆర్‌ అడుగులకు మడుగులొత్తే నేతలు గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. కె.ఆర్‌.నారాయణన్‌ను రాష్ట్రపతి చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని ఆయన చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్‌కూ అన్యాయం జరిగిందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అమరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్‌దేనని అన్నారు. ఎందరో ఎస్సీలు, ఎస్టీలకు కీలక పదవులను ఇచ్చింది కాంగ్రెస్సేనని అన్నారు. రిజర్వేషన్ల విధానాన్ని తీసుకువచ్చిందే కాంగ్రెస్‌ పార్టేనని తెలిపారు. తెలంగాణకు ఎస్సీ నేతను తొలి సీఎం చేస్తానని కేసీఆర్‌ అన్నారని... కానీ ఎస్సీని ఉపముఖ్యమంత్రిని చేసి రెన్నెళ్లకే కేసీఆర్‌ తొలగించారని విమర్శించారు.

కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీలకు చోటు దక్కలేదని ఆయన ఆరోపించారు. ఆదివాసీల జీవితాలు మార్చాలనేదే కాంగ్రెస్‌ ప్రణాళికలని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కోసమే పథకాలు తెచ్చానని సీఎం ఒప్పుకున్నారని చెప్పారు. ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్‌కు ఎస్సీలు గుర్తుకు వచ్చారని... దళితబంధును అన్ని నియోజకవర్గాల్లో ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. రూ.4 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. కాంట్రాక్టులు, కమీషన్ల ద్వారా వేల కోట్లను కేసీఆర్‌ కుటుంబం దోచుకుందని ఆరోపించారు.

119 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావాలి..

తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితుణ్ని చేస్తానన్నడు. ఒక దళిత ఉపముఖ్యమంత్రి ఉంటే పంచె గట్టుకున్నడని చూసి ఓర్వలేక అవినీతి ముద్ర వేసి పదవి నుంచి బర్తరఫ్​ చేసిండు. ఇవాళ ఉపఎన్నికలొస్తే హుజూరాబాద్​లోని దళిత కుటుంబాలకు 10లక్షలు ఇస్తా అంటున్నడు. ఉపఎన్నికల కోసం ఇస్తున్నరా అంటే.. నేను మఠం నడుపతలేను.. రాజకీయ పార్టీని నడుపుతున్నా అంటున్నడు. 119 నియోజకవర్గాల్లో ఉపఎన్నిక రావాలి.. ఉపఎన్నికలొస్తేనే దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు 10లక్షలు కేసీఆర్​ ఇస్తడు. సోనియా గాంధీ ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ ఇచ్చిందో... ఆ ఆకాంక్షలు కేసీఆర్​ పాలనలో నెరవేరలేదు. -రేవంత్ ​రెడ్డి, టీపీసీసీ చీఫ్​

ఇంద్రవెల్లి స్ఫూర్తితో గడీల పాలనను పారదోలుదాం: రేవంత్ రెడ్డి

గిరిజనులను పోలీసులతో కొట్టస్తున్నారు: భట్టి విక్రమార్క

రాష్ట్ర ఖజానాను సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్​ నిరంతరం పోరాటం చేస్తోందని ఆయన అన్నారు. ప్రజలను పక్కదోవ పట్టిస్తూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని భట్టి విమర్శించారు. తెలంగాణ ప్రజల ఉద్యమ ఆశయాలను కేసీఆర్ ఏనాడో తొక్కేశారని మండిపడ్డారు. అడవిని నమ్ముకున్న గిరిజనులను పోలీసులతో కొట్టిస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. దళితబంధును 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని ఆయన కోరారు. దళితబంధులాగే ఎస్టీలకు కూడా ఒక పథకం అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: ఇంద్రవెల్లిలో కాంగ్రెస్‌ దళిత, గిరిజన దండోరా సభ.. భారీగా తరలివచ్చిన జనం

Last Updated : Aug 9, 2021, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details