Nagoba Jatara 2022:ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నాగోబా జాతర వైభవంగా ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నాగోబాకు మొక్కులు చెల్లించుకున్నారు. చివరిరోజు కావడం వల్ల ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా డోలు వాయిస్తూ.. జాతరకు వచ్చారు. నాగోబా ఆలయంలో మెస్రం వంశీయుల ప్రత్యేక పూజలు ముగిశాయి. గోవాడ ముందు సంప్రదాయబద్ధంగా బేతా పూజలు నిర్వహించారు. గత నాలుగు రోజులుగా జాతర ఘనంగా కొనసాగింది. మారుమూల గిరిజన గ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చారు. 22 మంది ఆడపడుచులకు ప్రసాదం పంచి పెట్టారు. సహపంక్తి భోజనం చేశారు. రాత్రి వేళల్లో గోండు భాషలో మహాభారతం, రామాయణం వంటి పురాణాలపై నాటకాలు ప్రదర్శించారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చారు.
పీఠాధిపతి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్
మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు అనాదిగా వస్తున్న ఈ కార్యక్రమాన్ని... పీఠాధిపతి వెంకటరావు ఆధ్వర్యంలో జరిపారు. కరోనా కారణంగా ప్రభుత్వం నిర్వహించకపోవడంతో గురువారం మొట్టమొదటిసారిగా ఆలయ పీఠాధిపతి ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు. అధికారులు కొవిడ్ పేరు చెప్పి... దర్బార్ను నిర్వహించడాన్ని విస్మరిస్తున్నారని మెస్రం వంశీయులు పేర్కొన్నారు. కరోనా పేరుతో దర్బార్ వాయిదా వేయడం సరికాదన్నారు. జాతర ఏర్పాట్లపై ఐటీడీఏ పీవోతో పాటు ఇతర శాఖల అధికారులు నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆడపడుచుల ప్రత్యేక పూజలు
మెస్రం వంశీయులు ఈనెల ఒకటో తేదీన అర్ధరాత్రి గోదావరి జలంతో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో జాతర ప్రారంభమైంది. మూడు రోజులుగా ఆడపడుచులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆడపడుచుల సమక్షంలో గోవాడ ముందు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ విన్యాసాలు చేశారు. జాతర ముగింపు వేడుకలు నిర్వహించారు. ఉట్నూర్ మండలం శ్యాంపూర్ బుడుందేవ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు పయనమయ్యారు.
జాతర విశేషాలు ఇవే..
ఏటా పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి మహాపూజతో జాతర ఆరంభిస్తారు. అంతకంటే నెల ముందు నియమనిష్టల ప్రస్థానం ప్రారంభమవుతుంది. మెస్రం, గోడం ఆడపడచులు కొత్తకుండల్లో తెచ్చే పవిత్రజలాన్ని తుడుం మోతలు, సన్నాయి స్వరాల మధ్య అందరిపై చిలకరిస్తారు. మర్రిచెట్టునీడన అందరూ తెచ్చిన గట్క (జొన్న సంకటి), సాంబారు నాగోబాకు ప్రత్యేక నైవేద్యం. ఎవరికీ ఎవరూ భారం కాకూడదనేది ఈ నైవేద్య సమర్పణలో అంతర్లీనంగా ఉన్న సూత్రం. ఇప్పటికీ జాతరకు ఎడ్లబళ్లపైనే రావాలన్నది నియమం. ఏడాదికి సరిపడా వంటపాత్రలు, వ్యవసాయ పనిముట్లు జాతరలో కొనుగోలు చేయాలనేది ఆచారం. అమావాస్యనాటి ఈ జాతర వెలుగులు పంచుతుందని, తాము నిష్కల్మషంగా ఉంటే దేవత కాపాడుతుందని నమ్ముతారు. ఏటా జాతరకు వెళ్లి నాగోబా దేవతను పూజించడం వల్ల ఎలాంటి ఆపదలూ రావని, ఏడాదంతా మంచే జరుగుతుందని ఆదివాసీల అచంచల విశ్వాసం. అదే వారిలో ధైర్యస్థైర్యాలను నింపుతోంది.
ఇదీ చదవండి:Nagoba Jatara 2022: 'ఆ మొక్కు తీర్చుకుంటేనే కోడలిగా గుర్తింపు.. లేదంటే..'