సివిల్స్ ఫలితాల్లో 742 ర్యాంకు సాధించిన సుచేంతన్ రెడ్డి... ఆదిలాబాద్ విద్యానగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రొద్దుటూరి నారాయణరెడ్డి, రజని దంపతుల పెద్ద కుమారుడు. మూడేళ్ల వయస్సులోనే మందు వికటించి కంటిచూపును కోల్పోయిన సుచేంతన్... ఆత్మవిశ్వాసం కోల్పోకుండా విద్యనభ్యసించారు.
చిన్నప్పటి నుంచే చదువులో మేటి...
కొడుకుకు చిన్నప్పుడే ఎదురైన పరిస్థితిని చూసి ఎంతో బాధపడ్డారు ఆ దంపతులు. వారి బాధలను దూరం చేస్తూ సుచేంతన్‌రెడ్డి చదువులో చూపుకలిగిన వారి కంటే మెరుగ్గా రాణించాడు. ఏడో తరగతిలో ఏకంగా పాఠశాల టాపర్‌గా నిలిచి అప్పటి గవర్నర్ సుశీల్‌కుమార్ షిండే చేతుల మీదుగా జ్ఞాపికను అందుకున్నాడు. పదోతరగతి వరకు అంధుల పాఠశాలలో, ఇంటర్ సాధారణ కళాశాలలో చదివి అందరిలో మేటి అనిపించుకున్నాడు. డిగ్రీ, పీజీ విద్యను దిల్లీలో పూర్తిచేశారు. ప్రస్తుతం పీహెచ్‌డీ మొదటి సంవత్సరం చదువుతూ సివిల్స్ పరీక్షలకు హాజరై తొలి ప్రయత్నంలోనే ఎలాంటి కోచింగ్ లేకుండా ఆలిండియా స్థాయిలో 742 ర్యాంకు సాధించడం విశేషం.
తల్లిదండ్రుల పుత్రోత్సాహం...
అంధుడైన తమ కుమారుడి బతుకు ఏమౌతుందోనని తొలుత భయపడ్డ ఆ తల్లిదండ్రులు... సివిల్స్‌లో రాణించడం పట్ల ఆనందబాష్పాలతో పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నారు. ఐఏఎస్ కావడమే తమ కుమారుడి లక్ష్యమని చెబుతున్నారు.