Chicken Pox Disease: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే ఉట్నూర్ ఏజెన్సీలో ఆటలమ్మ వ్యాధి విజృంభిస్తోంది. కనీస వైద్యసేవలకు నోచుకోని ఆదివాసీగూడాల్లో కలవరం సృష్టిస్తోంది. శరీరమంతా దద్దుర్లు, తీవ్రమైన జ్వరాలతో చిన్నపిల్లలు చూస్తుండగానే మంచంపట్టడం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఆదిలాబాద్ గ్రామీణం, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, సిర్పూర్, తిర్యాణి, కెరమెరి, సిరికొండ, ఇచ్చోడ, బజార్‌హత్నూర్‌లాంటి ప్రాంతాల్లో వ్యాధితీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. చిన్నారుల శరీరం దద్దుర్లతో ఎర్రబారుతుండటం ఆదివాసీల్లో వణుకుపుట్టిస్తోంది
ఉమ్మడి జిల్లాలో 73 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 పట్టణ ఆరోగ్యకేంద్రాలు, పది సామాజిక ఆసుపత్రులు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సరిగా వైద్యసేవలు అందటంలేదు. ఏళ్లుగా వైద్యపోస్టులు భర్తీకాకపోవడం, విధుల్లోని డాక్టర్లపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడం అవరోధంగా మారుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నెలకోసారైనా మారుమూల ప్రాంతాల ప్రజల బాగోగులను పరీక్షించాలనే ప్రభుత్వ ఆశయం ఆచరణలోకి రావడం లేదు. అడపా, దడపా ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలను మినహాయిస్తే... వైద్యులెవరూ తమ గూడాలకు రావడంలేదనే ఆవేదన ఆదివాసీల నుంచి వినిపిస్తోంది.
ఏజెన్సీ ప్రాంత పిల్లల్లో పౌష్టికాహారలోపం స్పష్టంగా కనిపిస్తోంది. పిల్లల్లో రక్తహీనతను తగ్గించేలా గతంలో ఉట్నూర్ ఐటీడీఏ యంత్రాంగం బెల్లంపట్టీలను పంపిణీ చేసేది . ఇప్పుడా పరిస్థితి లేకపోగా.. క్షేత్రస్థాయిలోని పరిస్థితులు ఆరాతీయకపోవడం యంత్రాంగం నిర్లక్షణ్యానికి అద్దం పడుతోంది. వ్యాధుల కారణంగా బడికి వచ్చే పిల్లల సంఖ్య తగ్గిపోతుందనే మాట ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తోంది.