ఆదిలాబాద్‌లోని అశోక్ రోడ్డులో ఆరేళ్ల కిందట జరిగిన చిన్న సంఘటన ఆమెను ఓ సేవా సంస్థ ప్రారంభించేలా ప్రోత్సాహించింది. ఓ అనాథ శవాన్ని ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లడం చూసి ఆమెలో ఓ ప్రశ్న మొదలైంది.
మీరిద్దరే ఉన్నారేంటి అని అడుగ్గా... ఇది ఒక అనాథ శవం అని వారు ఇచ్చిన జవాబు ఆమెను సేవవైపు నడిపించింది. అనంతరం వారితోపాటు వెళ్లి ఆ శవానికి అంత్యక్రియలు చేసింది.
ఇప్పటివరకు...
ఆమె పేరు శశికళ. ఆదిలాబాద్‌లో రెవెన్యూ ఉద్యోగిగా పని చేస్తుంది. ఆ ఘటన తరువాత ఆమె అనాథ శవాలకు అంత్యక్రియలు చేయాలని నిశ్చయించుకుంది.
అనుకున్నదే తడవుగా మానవ సేవే-మాధవ సేవ అనే ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ సంస్థ 110 అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించారు.
కుష్టు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు సైతం అంత్యక్రియలు నిర్వహించి వీరు మానవత్వం చాటుకుంటారు. శవాగారంలో శవపరీక్ష... పూర్తవ్వగానే మృతదేహాలకు సొంతడబ్బులతో కొత్తబట్టలు, పూలమాలలు కొని స్మశానాలకు తరలిస్తారు. అనంతరం సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు చేస్తారు.