CCI Cement Factory: దశాబ్దాల చరిత్ర ఉన్న ఆదిలాబాద్ పరిశ్రమ భవితవ్యం ఏంటనేది... ఇప్పుడు ఎవరికీ అంతుపట్టడం లేదు. ప్రత్యక్షంగా 1,500 మందికి, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి చూపిన పరిశ్రమ... నేడు సమస్యల నిలయంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడంతో ఈ పరిశ్రమ గురించి పట్టించుకునే వారే కరవయ్యారు. కేంద్రప్రభుత్వ సంస్థ అయిన సీసీఐ... పాలకులు అనుసరించిన విధివిధానాలతోనే ఖాయిలా పరిశ్రమగా మారింది. దీంతో భూనిర్వాసితులు, ఉద్యోగుల బతుకుల్లో అలజడి రేకెత్తిస్తోంది. అద్భుతమైన వనరులలతో అలరారిన సంస్థ ఇప్పుడు తుక్కు కేంద్రంగా దర్శనమిస్తోంది.
నోలాస్-నోప్రాఫిట్ కింద: భౌగోళికంగా ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమకు అనుకూలంగా ఉందని 1970 దశకం కంటే ముందే అప్పటి కేంద్రప్రభుత్వం గుర్తించింది. అనుకూలమైన రోడ్డు, రైల్వే రవాణా సౌకర్యంతో పాటు వందేళ్లకు తరగని ముడిసరకు పుష్కలంగా ఉండడంతో... 1978-79 సంస్థ అంకురార్పణకు భూమిపూజ జరిగింది. 1982 ఆగస్టు 15న సిమెంటు ఉత్పత్తిని ప్రారంభించింది. రెండేళ్ల వ్యవధిలోనే అంటే 1984 మే మాసంలో అప్పటి కేంద్ర భారీ పరిశ్రమలశాఖామంత్రి ఎన్డీ తివారీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు చేతుల మీదుగా సిమెంటు అమ్మకాలను ప్రారంభించింది. సహజంగానే కొత్తగా ఏర్పడే ప్రభుత్వ రంగ పరిశ్రమల మాదిరిగానే 1984 నుంచి 90వరకు నోలాస్-నోప్రాఫిట్ కింద పరిశ్రమ కొనసాగింది. ఆ తరువాత 1991 నుంచి 1993వరకు లాభాల్లో నడిచింది. అలా... దేశవ్యాప్తంగా ఓ వెలుగు వెలిగింది.
మరో వందేళ్లకు: ఆదిలాబాద్ మండలం పరిధిలోని లాండసాంగ్వి, బెల్లూరి, అర్టి గ్రామాల శివారులో కొనుగోలు చేసిన 774 ఎకరాల్లో నిక్షిప్తమై ఉన్న సున్నపురాయి మరో వందేళ్లకు సరిపోతోంది. ప్రారంభంలోనే ప్రత్యక్షంగా 530 శాశ్వత ఉద్యోగులు, మరో 1,500 మంది తాత్కాలిక ఉద్యోగులు సహా దాదాపుగా నాలుగువేల మందికి ఉపాధిచూపి ఆదిలాబాద్ వ్యాపార జగత్తులో నెలకు మూడు కోట్ల టర్నోవర్‌తో సంచలనం సృష్టించింది. అంతా సాఫిగా సాగుతున్న సంస్థలో 1991-92లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాలను అమలు చేయడంతో పరిశ్రమ మనుగడనే ప్రశ్నార్థకంగా మారింది. 1991-93వరకు మూడేళ్ల పాటు తీసుకున్న లాభాల వాటాను ఇవ్వని కేంద్ర ప్రభుత్వం... బడ్జెట్ మద్దతును ఉపసంహరించుకుంది. ప్రభుత్వ నిధుల కేటాయింపు ఆగిపోవడంతో పాలు ఉత్పత్తి పేరుకుపోయింది. ఈ దశలోనే దేశవ్యాప్తంగా సిమెంటు సంక్షోభం తలెత్తింది. ప్రైవేటు పరిశ్రమలతో పోటీపడలేక.. ఆదిలాబాద్ పరిశ్రమ ఉత్పత్తి చేసిన సిమెంటు అమ్ముడుకాలేదు. ఫలితంగా ఈ పరిశ్రమను 1995-96లో ఖాయిలా పరిశ్రమగా ప్రభుత్వం గుర్తించింది.
బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ రీ-కన్‌స్ట్రక్షన్- బీఐఎఫ్ఆర్ నివేదించాక... అదే ఏడు కేంద్ర క్యాబినెట్ సంస్థను విక్రయించాలనే నిర్ణయానికి వచ్చింది. అంతేకాదు.. ఆదిలాబాద్ పరిశ్రమను తిరిగి తెరిపించాలనే దానికి బదులు... అసోంలోని పరిశ్రమను చేర్చడంతో సీసీఐ కష్టాల్లో పడింది. అప్పటి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సరైన సఖ్యతలేకపోవడంతో వెనకబడిన ఆదిలాబాద్ జిల్లాకు బంగారుభవితను ప్రసాదిస్తుందనుకున్న సీసీఐ మనుగడనే ప్రశ్నార్థకంగా మారింది.
కేంద్రానిదే బాధ్యత: నిబంధనల ప్రకారమైతే ప్రభుత్వ రంగంలో ఉన్న ఈ పరిశ్రమ... లాభనష్టాలకు కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంది. ఇందులో భాగంగ ఇక్కడ ఉత్పత్తి అయిన సిమెంటులో 60శాతం 1988 వరకు కేంద్రమే కొనుగోలు సైతం చేసింది. కానీ... ప్రైవేటు పరిశ్రమలతో పోటీ పడేలా బహిరంగ మార్కెట్‌కు ప్రోత్సహించాల్సింది పోయి... ఏకంగ ఖాయిలా పరిశ్రమగ ప్రకటించడంతో ఉద్యోగులపై ప్రభావం చూపింది. దాదాపు 250 మంది రెగ్యులర్ ఉద్యోగులను వీఆర్‌ఎస్, మరో 140 మంది ఉద్యోగులను వీఎస్‌ఎస్ ద్వారా తప్పించింది.