Harish Rao Speech at BRS Public Meeting Adilabad :కాంగ్రెస్ రెండో జాబితా వచ్చాక.. బీఆర్ఎస్ సెంచరీ కొడుతుందనే నిర్ణయానికి వచ్చామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ రెండో జాబితా(Congress MLA Candidates Second List) తర్వాత.. ఆ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయని పేర్కొన్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సెంచరీ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి.. ఉట్నూరులో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పదేళ్ల నుంచి రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ పదేళ్లలో కరవు లేదు.. కర్ఫ్యూ లేదన్నారు. ఇందుకే కేసీఆర్ చేతిలో రాష్ట్రం ఉంటే పదిలంగా ఉంటుందని తెలిపారు. ఇప్పుడు మన రాష్ట్ర పాలన దిల్లీ నాయకుల చేతుల్లో ఉండాలా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని.. కర్ణాటక రైతులు వచ్చి ప్రచారం చేస్తున్నారన్నారు. ఈసారి బీజేపీ నేతలకు డిపాజిట్లు రాకుండా చూడాలని ఓటర్లను కోరారు. రైతుబంధు(Ryathu Bandhu Scheme) ఇవ్వొద్దని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని మండిపడ్డారు. ఇప్పటికే ఈ పథకం కింద రైతులకు కేసీఆర్ రూ.72 వేల కోట్లు ఇచ్చారన్నారు. రైతు బంధు వద్దన్న కాంగ్రెస్‌ను రైతులు ఓడించాలని పిలుపునిచ్చారు.
BRS Praja Ashirvada Sabha at Adilabad :కాంగ్రెస్ హయాంలో ఎరువులు లేవు.. ధాన్యం కొనే దిక్కులేదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ సాగుకు 24 గంటల కరెంటు అందిస్తే.. కాంగ్రెస్ నేతలు మాత్రం 3 గంటల కరెంటు చాలని అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను నమ్మితే ఆగం అవుతామని.. మోసం, దగాకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్ అవుతాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ నేతలు టికెట్లను అమ్ముకుంటున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అందుకే ఓటుకు నోటు దొంగల చేతుల్లో తెలంగాణ ఉండకూడదని అభిప్రాయపడ్డారు.