BRS Election Campaign in Telangana :సంక్షేమ పథకాలే ప్రచారాస్త్రంగా మలుచుకున్న బీఆర్‌ఎస్(BRS).. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. ఓవైపు అధినేత ప్రజాశీర్వాద సభలతో జనాల్లోకి వెళుతుంటే.. మరోవైపు అభ్యర్థులు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి ప్రచారాలు(BRS Election Campaign) నిర్వహిస్తున్నారు. మళ్లీ మూడోసారి బీఆర్‌ఎస్‌నే అత్యధిక స్థానాల్లో గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పార్టీ శ్రేణులు తెలుపుతున్నారు. అందులో భాగంగా అభ్యర్థులు తమతమ నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు.
కూకట్‌పల్లి నియోజకవర్గ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు వివరించారు. నల్లగుట్ట చుట్టాల బస్తీ ప్రాంతంలోని పలువురు బీజేపీ యువకులు మంత్రి తలసాని ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. 70 నుంచి 80 సీట్లతో మరోసారి సర్కారు ఏర్పాటు చేస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మూడు సీట్లు రాని బీజేపీ.. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
రణరంగాన్ని తలపిస్తున్న తెలంగాణ ఎన్నికలు, ఆ పార్టీల మధ్యే ప్రధాన పోరు
"అన్ని లెక్కలు చూసుకున్న తర్వాతనే కేసీఆర్ మేనిఫెస్టోను విడుదల చేశారు. గతంలో మేనిఫెస్టో విడుదల చేసి అవి అమలు చేసిన తర్వాత.. కల్యాణ లక్ష్మీ అనే కార్యక్రమం మేనిఫెస్టోలో లేదు. మాకు వెసులుబాటు వచ్చింది కావున చేయగలిగాం. ముఖ్యమంత్రి అన్ని ఆలోచనలు చేసిన తర్వాత మేనిఫెస్టో విడుదల చేశారు. అంతేగాని కాంగ్రెస్, బీజేపీ ఏదో మేనిఫెస్టో విడుదల చేస్తే అలవోకగా విడుదల చేసింది అయితే ఇది కాదు. తప్పకుండా తొమ్మిదిన్నర ఏళ్లు అధికారంలో ఉన్నాము.. అందుకే తమకు సమస్యలు తెలుసు."- తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి