లాక్డౌన్ కారణంగా పెళ్లి నిలిచిపోయి... జరుగుతుందో లేదోనని మనస్తాపం చెంది యువతీ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కంపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగారాం రెండవ కూతురు సీతాబాయ్కి... ఉట్నూర్ మండలం కన్నాపూర్‌కు చెందిన గణేశ్‌తో వివాహం నిశ్చయమైంది.
లాక్డౌన్ వల్ల పెళ్లి కావట్లేదని 'జంట' ఆత్మహత్య - lock down effect
పెద్దలు పెండ్లి సంబంధం చూశారు. అమ్మాయి, అబ్బాయి ఇష్టపడ్డారు. ఇంకేముంది లగ్గానికి ముహూర్తం నిర్ణయించారు. కానీ... లాక్డౌన్ పెండ్లికి అడ్డంకైంది. ఇటు లాక్డౌన్ పూర్తి కావట్లేదు.. తమ పెండ్లి కావట్లేదని మనస్తాపం చెందిన యువతీయువకుడు కుటుంబసభ్యులకు చెప్పి మరీ ఆత్మహత్య చేసుకున్నారు.
లాక్డౌన్ కారణంగా పెళ్లి నిలిచిపోయింది. వారం రోజుల కిందట సీతాబాయి ఇంటికి గణేశ్ వెళ్ళి... అక్కడే పొలం పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు.ఇన్ని రోజులైనా పెళ్లి కావట్లేదు... ఇక ముందు కూడా జరుగుతుందో లేదో అని వధూవరులు మనస్తాపం చెందారు. కంపూర్ గుట్టపైకి వెళ్లారు. కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పి... పురుగుల మందు తాగేశారు.
హుటాహుటిన గుట్టపెకి వెళ్లిన కుటుంబసభ్యులకు ఇద్దరు విగతజీవులుగా దర్శనమిచ్చారు. విషయం తెలుసుకున్న నార్నూర్ ఎస్సై విజయ్... ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.