MLA Rathod Bapurao Car Accident News : ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాఠోడ్ బాపూరావుకు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఆయన వాహనం.. నెరడిగొండ మండలం కొరిటికల్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ఎదురుగా పశువు రావడంతో ప్రమాదం చోటుచేసుకోగా.. ఘటనలో ఎమ్మెల్యే చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆయనను బోథ్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం ఎమ్మెల్యే ఆదిలాబాద్‌లోని తన స్వగృహానికి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి భారీగా తరలివచ్చారు. అందరి ఆశీస్సుల వల్ల ప్రాణాలతో బయటపడ్డానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ నెల 22న తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్ వెళ్లాను. ఈరోజు తిరిగి వస్తుండగా.. అనుకోకుండా రోడ్డుప్రమాదం జరిగింది. దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల ఎలాంటి అపాయం జరగలేదు. నన్ను పరామర్శించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఇది దేవుడు నాకు ఇచ్చిన రెండో జన్మగా భావిస్తా. - రాఠోడ్ బాపూరావు, బోథ్ ఎమ్మెల్యే
ఉదయం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి కాన్వాయ్‌లోని ఓ కారు సైతం ప్రమాదానికి గురైంది. కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి పీఠానికి వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోహిత్ రెడ్డి కారు చెట్టును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఎమ్మెల్యే కారులో లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
అతి వేగానికి ముగ్గురు యువకులు బలి..: ఇదిలా ఉండగా.. ఈ ఉదయం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ శివారులో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బొలెరో వాహనం అదుపు తప్పి లారీని ఢీకొనటంతో ప్రమాదం చోటుచేసుకోగా.. ఘటనా స్థలిలో ఒకరు, ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. మృతులు నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో గొర్రెలు తీసుకువెళ్లి.. తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగినట్లు తెలిపారు.