Bandi Sanjay Fires on KCR: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా జాతరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌తో కలిసి కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రి అర్జున్ ముండా హాజరయ్యారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన అతిథులకు మెస్రం వంశీయులు సాదర స్వాగతం పలికారు. విశేష చరిత్ర కలిగిన మెస్రం వంశీయులు భక్తిప్రపత్తులతో జరుపుకునే నాగోబా జాతరకు రావడం సంతోషంగా ఉందని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్‌ముండా హర్షం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీల హక్కులను కాలరాస్తోంది:ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలకు న్యాయం జరిగేందుకు ఎంతో కృషిచేస్తుందని కేంద్రమంత్రి అర్జున్‌ముండా వివరించారు. తన దృష్టికి తెచ్చిన ఆదివాసీల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీల హక్కులను కాలరాస్తోందని ఆయన ఆక్షేపించారు.
బీజేపీ నేతలను వేధింపులకు గురిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు మొహం చెల్లకనే.. బీఆర్‌ఎస్ పేరుతో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారని ఆరోపించారు. ప్రజాసంక్షేమం మరిచిన ముఖ్యమంత్రి.. బీజేపీ నేతలను వేధింపులకు గురిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు .
బీఆర్‌ఎస్ పూర్తిగా దివాలా తీసిన కంపెనీ: బీఆర్‌ఎస్ పూర్తిగా దివాలా తీసిన కంపెనీ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఆదివాసీల సంక్షేమం, పోడు భూములకు పట్టాలు తదితర అంశాలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే బీజేపీ సర్కార్‌లో నాగోబా జాతరను అధికారికంగా జరపడంతో పాటు పండగలకు ప్రత్యేక నిధులిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.