Azad Encounter Case: మావోయిస్టు అగ్రనేత చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్రపాండేల ఎన్‌కౌంటర్ కేసు కీలకమలుపు తిరిగింది. కేసును విచారిస్తున్న ఆదిలాబాద్ జిల్లా కోర్టు మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని న్యాయమూర్తి ఎం.ఆర్.సునీత స్పష్టం చేశారు. విచారణను మూడు నెలల్లోగా చేపట్టాలని ఆదిలాబాద్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టును ఆదేశించారు. ఈ తీర్పుతో పోలీసులను విచారించనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది.
అడుగడుగునా ఉత్కంఠ.. అనూహ్య మలుపులు
కుమురం భీం జిల్లా (అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్) వాంకిడి మండలం సర్కేపల్లి వద్ద 2010 జులై 1న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆజాద్, హేమచంద్రపాండే మృతిచెందారు. ఆ ఎన్‌కౌంటర్ బూటకమని.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని పాండే సతీమణి బినీతతోపాటు హక్కుల కార్యకర్త స్వామి అగ్నివేశ్ 2011 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.
* 2012 మార్చిలో సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఎన్‌కౌంటర్ నిజమైనదేనంటూ పోలీసులకు క్లీన్‌చిట్ ఇచ్చింది. సీబీఐ నివేదికను ఆదిలాబాద్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ (ట్రయల్) కోర్టులో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ నివేదికపై బినీతతోపాటు ఆజాద్ సతీమణి పద్మ ట్రయల్‌కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం తగిన సాక్ష్యాధారాలు లేవంటూ ఆ పిటిషన్లను 2015లో కొట్టివేసింది.
* దీనిపై పిటిషనర్లు 2015లో జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 29 మంది పోలీసుల్ని నిందితులుగా పరిగణించి విచారణ జరపాలని అభ్యర్థించారు. దీంతో మునుపెన్నడూ లేని విధంగా పోలీసులు కోర్టుకు హాజరై నిర్దోషిత్వం నిరూపించుకోవాలని కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ ఎన్‌కౌంటర్ బూటకమని, ఇందులో పాల్గొన్న 29 మంది పోలీసులపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని తీర్పు చెప్పింది.
* ఈ తీర్పును సవాలు చేస్తూ పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. వారి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పోలీసుల అభ్యర్థనను వినకుండానే జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసిందని వాదించారు. కేసులో వారిని కనీసం ప్రతివాదులుగా చేర్చలేదని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిరంజన్‌రెడ్డి వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. నిందిత పోలీసులు వ్యక్తిగతంగా ట్రయల్‌కోర్టులో విచారణకు హాజరుకావాలన్న ఆదేశాల్ని పక్కనపెట్టింది. అలాగే తదుపరి ప్రొసీడింగ్స్‌ను నిలిపివేసింది.
* దీనిపై పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ కేసును ఆదిలాబాద్ జిల్లా కోర్టుకు బదిలీచేసింది. అప్పటి నుంచి వాద, ప్రతివాదనలు కొనసాగాయి. కోర్టు ఆదేశాల మేరకు గత నెల 26న పోలీసులు, ఈ నెల 1న ఆజాద్ తరఫు న్యాయవాదులు రాతపూర్వక వాదనలు సమర్పించారు. వాటిని పరిశీలించిన కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.
ఇవీ చదవండి:రాష్ట్రంలో నెలాఖరులోగా కొత్త పోలీస్‌బాస్ రాకపై నెలకొన్న సందిగ్ధత
గవర్నర్‌కు సర్కారు షాక్.. యూనివర్సిటీల ఛాన్స్‌లర్‌గా తొలగింపు!.. అసెంబ్లీలో బిల్లు పాస్