ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న జన్మదినం సందర్భంగా జులై 4న జిల్లాలో మొత్తం 10లక్షలు మొక్కలు నాటే కార్యక్రమానికి జోగు ఫౌండేషన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధానంగా గంట వ్యవధిలో 3.5లక్షల మొక్కలు నాటి... గిన్నిస్ రికార్డు సాధన దిశగా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 2019 నవంబర్ 11న టర్కీలో గంట వ్యవధిలో 3.03 లక్షలు మొక్కలు నాటి గిన్నిస్‌బుక్‌లో నమోదైన రికార్డును తిరగరాయడమే లక్ష్యంగా జోగు ఫౌండేషన్ సమాయత్తమవుతోంది. అందుకు ఎమ్మెల్యే జోగురామన్న పుట్టినరోజునే ముహూర్తం ఖరారు చేసింది.
శరవేగంగా సాగుతున్న ఏర్పాట్లు
ఆదిలాబాద్‌ను ఆనుకొని దుర్గానగర్ సమీపంలో ఖాళీగా ఉన్న 110 ఎకరాల ప్రభుత్వ స్థలంలో పదిరోజులుగా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మియావాకీ పద్ధతిలో మొక్కలు నాటేందుకు అనువుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జేసీబీలు, ట్రాక్టర్లతో పాటు పదుల సంఖ్యలో కార్మికులు గుంతలు తవ్వుతున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో మొక్కలను దుర్గానగర్‌కు తరలిస్తున్నారు.
సంతృప్తి వ్యక్తం చేసిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ బృందం
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా... రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆదిలాబాద్ రానున్నందున రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఇందులో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యుల బృందం దుర్గానగర్‌లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది.
దుర్గానగర్ ఫారెస్ట్‌లో 110 ఎకరాల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జోగురామన్న పుట్టినరోజు సందర్భంగా నాలుగు లక్షల మొక్కలు మియావాకి పద్ధతిలో చేస్తున్నాం. మియావాకి పద్ధతి అంటే ఒక చెట్టు పెద్దతి ఒక చెట్టు చిన్నది. ఈవిధంగా మొక్క మొక్కకు అడుగు దూరంలో మొక్కలు నాటుతున్నాం. ఈ విధంగా ఒక ఎకరాలో 4వేల మొక్కలు వస్తాయి. ఆ విధంగా 110 ఎకరాల్లో మొక్కలు నాటే ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తంగా ఆరోజు జిల్లా వ్యాప్తంగా పదిలక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -రాఘవ కిశోర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యుడు.