ఉమ్మడి రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్ల గౌరవవేతనం రూ.7,500 ఉండేది. కేసీఆర్ సర్కారు కొలువుదీరాక రూ.3000 పెంచడంతో రూ.10,500కు చేరింది. 2018 అక్టోబర్ 2న కేంద్రం దసరా కానుకగా మరో రూ.1,500 పెంచడంతో రూ.12లకు పెరిగింది. ఈ ఏడాది జులై నెలలో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం రూ.3,150 పెంచింది. ఈ లెక్కన ప్రతి అంగన్వాడీకి రూ.15,150 వేతనం ఇవ్వాలి. కానీ కేంద్రం దసరా కానుకగా ప్రకటించిన రూ.1,500లను పరిగణలోకి తీసుకొనే రాష్ట్రప్రభుత్వం రూ.3,150 పెంచడంతో రూ.13,650కే పరిమితమైంది. ఇవి కూడా చెల్లించడంలేదు. కాగితాల్లో వేతనాలు పెంచినట్లు ప్రకటించారే కానీ అంగన్వాడీలకు చెల్లిస్తున్నది కేవలం రూ.10,500 వేతనమే. మినీ అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు, ఆయాలకు పెరిగిన వేతనాలను పరిగణలోకి తీసకుంటే రూ.8,550 చెల్లించాల్సి ఉంది. కానీ ఆచరణలోకి రాకపోవడంతో నెలకు రూ.6,000 చొప్పున పాత వేతనాలతోనే పనిచేయాల్సి వస్తోంది.
ఏడేళ్లుగా టీఏ, డీఏల కోసం నిరీక్షణ
నెలనెల సీడీపీవోల పరిధిలో ప్రాజెక్టు సమావేశం, పర్యవేక్షకుల పరిధిలో సెక్టారు సమావేశం నిర్వహించాలనేది శిశుసంక్షేమశాఖలోని ప్రధాన నియమం. ఒక్కో సమావేశానికి రూ.260 డీఏ చొప్పున రెండు సమావేశాలకు కలిపి రూ.520 డీఏతోపాటు రవాణా ఛార్జీలు ఇవ్వాల్సి ఉంది. సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారే కానీ టీఏ, డీఏలు చెల్లించకపోవడంతో ఖర్చులను అంగన్వాడీలే భరించాల్సివస్తోంది. నెలనెల క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వడంలేదు. కొన్ని సందర్భాల్లో మూడు, నాలుగు నెలలకోసారి వేతనాలు విడుదల చేస్తుండంతో ఏ నెల వేతనం ఎప్పుడు విడుదవుతుందో తెలియక అయోయమానికి గురికావాల్సి వస్తోంది. 2014, 2016, 2017 ఆర్థిక సంవత్సరాల్లో ఒక్కో నెల వేతనం ఇప్పటికీ రాలేదు. ఆ వేతనాలు ఎవరు కాజేశారనేది అంతుచిక్కడంలేదు. వీటికోసం అంగన్వాడీ కార్యకర్తలు చాలా సార్లు ఆందోళనలు, ధర్నాలు నిర్వహించినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు.
గౌరవవేతనం పరిధిలో చేసే సేవలే
సహజంగానైతే అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు ఆటపాటలతో కూడిన చదువు చెప్పాలి. పిల్లల్లో ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం మధ్యాహ్న భోజనం పెట్టాలి. గర్భిణీలు, బాలింతల యోగక్షేమాలను పర్యవేక్షించాలి. వారికి పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం కేంద్రంలోనే వడ్డించాలి. పిల్లల ఎదుగుదలలో ప్రధానమైన ఎత్తు, బరువు, ఆరోగ్యస్థితిగతులను మాతాశిశుసంక్షేమంలోభాగంగా ప్రభుత్వం నిర్ధేశించిన 14 రిజిస్టర్లను రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ గౌరవవేతనం పరిధిలో చేసే సేవలే.