Dokra Craft: అంతరిస్తున్న ప్రాచీనహస్తకళ అది. అలాంటి కళకు ప్రాణం పోస్తున్నాడు ఓ ఆదివాసీ. ఈ తల్లి కుమారులది ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం బెల్సరీ రాంపూర్. ఆదివాసీ గోండు తెగకు చెందిన ఉయికే ఇంద్రజిత్ డోక్రా కళాకారుడు. తల్లి గంగుబాయి, తండ్రి లక్ష్మణ్‌తో పాటు వారి తాత, ముత్తాల నుంచి నేర్చుకున్న ప్రాచీన హస్త కళే వీరి జీవనాధారం. వారసత్వంగా వచ్చిన వృత్తికి సృజనను జోడించి గిరిజన సంస్కృతి సంప్రదాయాలను చాటే కళాఖండాలు, దేవతా విగ్రహాలు, ఇంట్లోని అలంకరణ బొమ్మలు తయారుచేస్తున్నారు. మైనంమట్టితో రూపొందించిన కళాకృతులకు ఇత్తడి పూతపోసి ఆకర్షణీయ బొమ్మలు సృష్టిస్తున్నారు.
ఇంద్రజిత్ చేతిలో రూపుదిద్దుకున్న కళాకృతులను అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ ప్రశంసించారు. హైదరాబాద్, దిల్లీ, పుణే, కోల్‌కతా వంటి మహానగరాల్లో జరిగిన ఎగ్జిబిషన్లలో పాల్గోన్నారు. ఎన్నో ప్రశంసాపత్రాలు, పురస్కారాలు పొందినా చిన్నపాటి పెంకుటిల్లు, రేకులషెడ్డులోనే ఇంద్రజిత్ నివాసం ఉంటున్నారు. భావి తరాలకు కళను ఉచితంగా నేర్పాలని ఉన్నా వచ్చేవారికి సరిపడా వసతులు కల్పించలేని పరిస్థితి ఉందని ఆయన వాపోయారు. ముడిసరుకు కొనుగోలుకు బ్యాంకు రుణం.. తన వద్దకు వచ్చే విద్యార్థులు ఉండేందుకు విశాలమైన హాలు కలిగిన ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఇంద్రజిత్ తల్లి గంగూబాయి ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.
ఇంద్రజిత్ హస్తకళానైపుణ్యం తెలుసుకొని సుదూరప్రాంతాల నుంచి విద్యార్థులు ఆయనను కలిసేందుకు వస్తున్నారు. ఆధునిక యుగంలో అంతరించిపోతున్న హస్తకళకు ఎలా జీవం పోస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెలకట్టలేని కళకు పురుడుపోస్తున్న ఇంద్రజిత్‌కి ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటును అందించాలని స్థానికులు కోరుతున్నారు. తద్వారా ఆ కళ భావి తరాల చేతుల్లో సజీవంగా ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.