తెలంగాణ

telangana

ETV Bharat / state

అద్దె రాదు.. రద్దు కాదు.. రూ.లక్షల్లో ఆదాయం కోల్పోతున్న జడ్పీ - Adilabad latest news

ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనం... అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆదిలాబాద్​ జిల్లా పరిషత్‌ నెలనెల రావాల్సిన రూ.లక్షల ఆదాయం కోల్పోతోంది. చివరికి చేసిన వ్యయాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేయడంలేదు. ఫలితంగా 15 దుకాణాలతో ఏర్పాటు చేసిన సముదాయం ఒప్పందం (అగ్రిమెంట్‌) దశ దాటడం లేదు. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో అనుకుంటే పొరపాటే. స్వయంగా జిల్లా పరిషత్‌ ఛైర్మన్, ముఖ్యకార్యనిర్వహణాధికారి కొలువై ఉండే జిల్లా పరిషత్‌ సముదాయం ఆనుకొని ఉన్న అద్దెగదుల దుస్థితి ఇది.

adilabad
adilabad

By

Published : Sep 10, 2021, 5:04 PM IST

Updated : Sep 12, 2021, 3:21 PM IST

ఆదిలాబాద్​ జిల్లా పాలనాధికారి కార్యాలయం పక్కన ఉన్న జిల్లా పరిషత్‌ కార్యాలయ ప్రహారిని ఆనుకొని ఉన్న ప్రాంతంలో భవన సముదాయం నిర్మిస్తే జడ్పీకి రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతుందని అధికారయంత్రాంగం ఏడాది కిందటనే నిర్ణయించింది. అనుకున్నదే తడువుగా దాదాపుగా రూ.50 లక్షలకు పైగా జడ్పీ సాధారణ నిధులు వెచ్చించి 15 దుకాణాల సముదాయాన్ని నిర్మించింది. పక్కనే జిల్లా కోర్టు, పాలన ప్రాంగణంతో పాటు బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖలు, ఎల్‌ఐసీ, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉండటంతో వ్యాపార, వాణిజ్యానికి దుకాణ సముదాయం అనువుగానే ఉంటుందనేది అందరిలో వ్యక్తమైంది.

భవన సముదాయం

అనుకున్నదానికంటే ఎక్కువే వచ్చింది

దీనికి అనుగుణంగా 15 దుకాణాల్లో రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎనిమిది దుకాణాలను సాధారణ వ్యక్తులకు కేటాయించిన యంత్రాంగం మరో మూడింటిని ఎస్సీలకు కేటాయించింది. సెల్ఫ్‌హెల్ఫ్‌గ్రూపు సభ్యులకు రెండు, వికలాంగులకు, నాయిబ్రాహ్మణులకు ఒక్కో దుకాణానాన్ని కేటాయించి ఒక్కో దుకాణానికి రూ.4వేల నుంచి రూ.6వేల మధ్య అద్దె నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి 17న అద్దెకు కోసం వేలం పాట నిర్వహించింది. అద్దెలో పాల్గొనేవారు రూ.40వేల చొప్పున డిపాజిట్‌ చేయాలని నిర్ణయించినప్పటికీ దుకాణాలను దక్కించుకోవడానికి తీవ్ర పోటీ ఏర్పడింది. అధికారులు ముందుగా నిర్ణయించిన దాని ప్రకారమైతే నెలకు సగటున రూ.77,300 అద్దె వస్తుందనుకంటే దుకాణాలకు ఏర్పడిన పోటీ కారణంగా 2.19 లక్షలుగా ఖరారైంది. ఈ నిధులు జడ్పీకి పాలనాపరంగా కలిసివచ్చే అంశంగా ప్రజాప్రతినిధులు, అధికారుల్లో ఆనందం వ్యక్తమైంది.

మొదటికొచ్చిన తంతు

వేలం పాట జరిగి ఆరునెలల కాలం కావొస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కరంటే దుకాణాలను తెరవలేదు. పైగా 15 దుకాణాల్లోని 1, 7, 11 ,15 నంబర్ల దుకాణాలకు ఒప్పంద ప్రక్రియ పూర్తికాలేదు. ఏప్రిల్‌ నెల నుంచి పరిగణలోకి తీసుకుంటే రూ.13.14 లక్షల అద్దె జడ్పీ చేజార్చుకుంది. నిబంధనల ప్రకారం అద్దెకు తీసుకున్న వ్యక్తులు ఒప్పందం చేసుకోకపోయినా, అద్దె చెల్లించకపోయినా వాటిని నిర్ణీత సమయంలో రద్దుచేసి ఇతరులకు కేటాయించాల్సి ఉంది. ప్రారంభంలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంత నిర్లక్ష్యం చేస్తే మళ్లీమళ్లీ ఈ దుకాణాల వ్యవహారాన్ని ఎవరుపట్టించుకునే పరిస్థితే ఉండదనే అభిప్రాయం అధికారవర్గాల నుంచే వ్యక్తం కావడం విశేషం. అద్దె వసూలుపై ఆసక్తిలేకపోతే రూ.50 లక్షలు వెచ్చించి జడ్పీ నిధులను ఎందుకు వినియోగించారనే అంశం అనుమానాలకు తావిస్తోంది. ప్రజాప్రతినిధుల ప్రేక్షకపాత్ర, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అద్దెగదుల భవన నిర్మాణ సముదాయం నమూనాగా మారింది.

అద్దె నిధులతో ప్రయోజనమిది

నెలనెల అద్దెను వసూలు చేస్తే సాధారణ పరిపాలనా సౌలభ్యం వినియోగించే వెసలుబాటు ఉంది. జిల్లాలో కనీస సౌకర్యాలు లేని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, పంచాయతీ భవనాల మరమ్మతుల కోసం వెచ్చించవచ్చు. అవీలేకపోతే ఒక్కో గ్రామానికి కనీసం రూ.10 వేల చొప్పున కేటాయిస్తే పల్లెల్లో ఒక్కో గదితో గ్రంథాలయాలను ఏర్పాటు చేయవచ్చు ఆట స్థలాలకు ప్రహారీ గోడలను నిర్మించవచ్చు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు ఆటవస్తువులనైనా, కూర్చోడానికి కుర్చీలనైనా కొనివొచ్చు. కానీ ఏంచేయకుండా ఆరునెలల అద్దెను రాబట్టడంలో జడ్పీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ఆసక్తి చూపని దుకాణదారులను నిబంధనల ప్రకారం రద్దుచేసే కొత్తవారికి ఇచ్చినా అన్ని విధాలుగా ప్రయోజనం ఉంటుంది.

ఇదీ చదవండి :ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళిసై తొలిపూజ

Last Updated : Sep 12, 2021, 3:21 PM IST

ABOUT THE AUTHOR

...view details