కఠిన హృదయాలను సైతం వైరాగ్యానికి గురిచేసే స్థలం శ్మశానం. అలాంటి ప్రాంతాల్లో ఆహ్లాదాన్ని పంచేలా ఆదిలాబాద్ మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. తాజా పంచాయతీరాజ్ చట్టం కింద ప్రభుత్వం కేటాయించిన నిధులతో.. శ్మశాన వాటికలను పూర్తి స్థాయిలో ఆధునీకరించడానికి పూనుకుంది. వాటికలను సర్వహంగులతో తీర్చిదిద్దనుంది. అంత్యక్రియలకు వచ్చే వారిని వాటికలోని వసతులు అసంతృప్తి పరచకుండా.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. చెత్తాచెదారానికి తావులేకుండా ప్రతీ శ్మశానంలో ఉద్యానవనాలకు రూపకల్పన జరుపుతోంది.
ఆదిలాబాద్ పట్టణ జనాభా లక్షా 55వేలు దాటింది. పట్టణ పెరుగుదలకు అనుగుణంగా శ్మశానవాటికలు లేవు. పైగా ఉన్నవాటి ఆలనా, పాలన సరిగా లేదు. కొన్ని చోట్ల కబ్జాదారులు శ్మశాన స్థలాలను సైతం వదలకుండా ఆక్రమిస్తుండటంతో.. మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించింది.
పట్టణ అవసరాలకు అనుగుణంగా గుర్తించిన 13శ్మశానవాటికల్లో వసతుల కల్పనకు రూ. 3కోట్ల 10లక్షలు కేటాయిస్తూ అభివృద్ధి పనులకు యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ప్రధానంగా భీంసరి, తిర్పెల్లి, శాంతినగర్, ఖానాపూర్, కేఆర్కే కాలనీల్లో ఆధునిక హంగులతో కూడిన వసతుల కల్పనకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ఒక్కో శ్మశానవాటికకు రూ. 35లక్షలు మొదలుకొని.. రూ.65 లక్షల వరకు నిధులు కేటాయించడంతో.. ఏళ్లుగా నిరాదరణకు గురైన శ్మశానాలకు గ్రహణం వీడినట్లయింది.