ఇది ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల. పదిహేను ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన గదులు, మైదానం కలిగి పచ్చదనంతో కళకళలాడుతున్న ఈ కళాశాల... 1957 ఏప్రిల్ ఒకటిన ప్రారంభమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒకప్పుడు ఏకైక కళాశాలగా ఉండటంతో ఇప్పుడున్న ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుకునేందుకు వచ్చేవారు. విశ్రాంత న్యాయమూర్తులైన జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ చంద్రకుమార్ ఇక్కడ చదువుకున్నవారే. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, మాజీ మంత్రి రాంచంద్రారెడ్డితో పాటు ప్రస్తుత కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ సహా మరో ఐదుగురు అధ్యాపకులు పూర్వవిద్యార్థులే. ఇక్కడ చదువుకున్న వారిలో ఎందరో వైద్యులు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులుగా.. మరెందరో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. కిందటేడాది వరకు ఆర్ట్స్, సైన్సు కోర్సులతో నడిచిన కళాశాలలో మరిన్ని కోర్సులూ అందుబాటులోకి వచ్చాయి.
ఎన్నో సౌకర్యాలు...
ప్రస్తుతం ఈ కళాశాలలో 870 మంది విద్యార్థులు, 23మంది అధ్యాపకులు ఉన్నారు. ఆరు ల్యాబ్‌లు, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్‌లు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్ఎస్ యూనిట్లు అందుబాటులో ఉండటంతో విద్యార్థులు ఇష్టమున్న రంగంలో రాణిస్తున్నారు. చదువుతో పాటు శారీరక ధృడత్వం పెంపొందించుకోవడానికి జిమ్, ఉద్యోగ కల్పనకు అవసరమైన ఉపాధి కోర్సులు తమకెంతో ఉపయోగకరంగా ఉన్నాయంటున్నారు విద్యార్థులు.
న్యాక్ గుర్తింపు
కళాశాల ఇప్పటికే బి గ్రేడ్ న్యాక్ గుర్తింపును కలిగింది. ఐదేళ్లకొకసారి ఇచ్చే గుర్తింపు కోసం న్యాక్ బృందం 15, 16 తేదీల్లో కళాశాలను సందర్శించనుంది. ఇందుకోసం యాజమాన్యం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.