తెలంగాణ

telangana

ETV Bharat / state

పంట కల్లం.. అన్నదాతల కష్టాలకు కళ్లెం - ఆదిలాబాద్ వార్తలు

పంట చేతికొచ్చాక దాన్ని ఆరబెట్టేందుకు అన్నదాత పడే కష్టాలు అన్నీ ఇన్నీకావు.. సరైన సౌకర్యాలు లేక రహదారులు, మైదాన ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ కష్టాలను దూరం చేసేందుకు ప్రభుత్వం పంట కల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఉపాధి హామీ పథకంలో నిధులను కేటాయించడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అర్హులైన అన్నదాతల గుర్తింపులో అధికారులు నిమగ్నమయ్యారు.

agriculture
agriculture

By

Published : Jul 26, 2020, 9:29 AM IST

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5.20 లక్షల మంది రైతులు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏటా వర్షాకాలం, యాసంగిలో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. అయితే కోత కోసిన పంటలను ఆరబెట్టేందుకు వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సరైన స్థలాలు లేక రహదారుల వెంట, మైదాన ప్రాంతాలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో రోడ్లపై పంట ఉండడంతో అవి కనిపించక ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. మైదాన ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు లేక వర్షం కురిసిన సమయంలో పంట తడిసి నాణ్యత దెబ్బతింటోంది. దీంతో రైతులు నష్టపోతున్నారు.

అన్నదాతల ఆసక్తి..

కర్షకులకు ఎదురవుతున్న కష్టాలను దూరం చేసేందు కోసం ఉపాధి హామీ పథకం కింద పంట కల్లాలను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.65.18 కోట్లు కేటాయించారు. మూడు పరిమాణాల్లో వీటిని నిర్మించనున్నారు. ఇందుకోసం సంబంధిత రైతుకు సొంతంగా వ్యవసాయ స్థలం ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం రాయితీతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. బీసీలు, ఇతరులు పది శాతం చెల్లిస్తే మిగతా 90 శాతం సర్కారు అందజేస్తుంది. నిర్మాణం పూర్తయ్యేలోపు రెండు దఫాలుగా డబ్బులను వాయిదాల రూపంలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రస్తుతం ఎంపీడీవో, వ్యవసాయాధికారి, ఏపీవోల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడుతూ అర్హుల జాబితాను రూపొందించడంలో నిమగ్నమయ్యారు. మంజూరైన నిధులలో నుంచి ఇప్పటి వరకు రూ. 52.19 కోట్లకు సంబంధించిన 6,917 పంట కల్లాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసేలా, పంట కల్లాలను రైతులకు చేరువ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

నిర్మల్‌లో లక్ష్యానికి చేరువలో..

పంట కల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం నిర్మల్‌ జిల్లాకు రూ.20.14 కోట్లు కేటాయించింది. వీటి కోసం జిల్లా వ్యాప్తంగా 3,038 దరఖాస్తులు వచ్చాయి. వంద శాతం రాయితీపై ఎస్సీ, ఎస్టీలకు, 90 శాతం రాయితీపై ఇతరులకు అవకాశం కల్పించారు. వచ్చిన దరఖాస్తులను గ్రామాల వారీగా పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, వ్యవసాయాధికారి, ఏపీవో పరిశీలించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు అందజేయగా ఇప్పటి వరకు 2,517 కల్లాలకు రైతులను ఎంపిక చేశారు.

వెనుకబడిన కుమురం భీం జిల్లా రైతులు

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాకు కల్లాల నిర్మాణాలకు రూ.12.58 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు కేవలం 344 మంది రైతులు మాత్రమే ఆసక్తి చూపారు. వీటి నిర్మాణానికి రూ.2.35 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది.. ఇంకా ఇక్కడ రూ.10 కోట్ల నిధులు కల్లాల నిర్మాణాలకు ఉన్నాయి.

రైతులకు మేలు

నిర్మల్‌ జిల్లాలో మూడు వేల కల్లాలను నిర్మించేలా లక్ష్యంగా నిర్ణయించాం. రైతులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకు 2వేలకు పైగా గుర్తించాం. మిగతా వాటిని త్వరితగతిన పూర్తి చేస్తాం. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించి ముందుకెళ్తున్నాం.

- వెంకటేశ్వర్లు, నిర్మల్‌ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

ABOUT THE AUTHOR

...view details