ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామునుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. సీజన్ ప్రారంభం నుంచి వరుస వర్షాలు లేకపోవడంతో ఇప్పటి వరకు చెరువులు, జలాశయాల్లోకి ఆశించిన స్థాయిలో వరద నీరు చేరలేదు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించడంతో చెరువుల్లోకి భారీగా నీరు చేరుతోంది. మరో వైపు పంటలు ఏపుగా పెరిగే అవకాశం ఏర్పడింది.
ఏకధాటి వర్షం... కర్షకుని కళ్లలో ఆనందం - adilabad farmers feeling happy
అడవుల జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురిసిన వానతో అన్నదాతలు ఆనందంలో మునిగిపోయారు. రెండ్రోజులుగా కురుస్తోన్న వర్షంతో జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
జిల్లాలో బుధవారం సగటున 33.1మిమీల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా తాంసి మండలంలో 80మిమీల వర్షం కురిసింది. జిల్లాలో ఇప్పటి వరకు నమోదు అయిన వర్షపాతం లెక్కల మేరకు సాధారణ వర్షపాతం 345మి.మీలు కాగా 342మి,మీల వర్షపాతం నమోదు అయింది. ప్రారంభంలో వర్షాలు కురవకపోవడంతో జిల్లాలోని గుడిహత్నూర్, భీంపూర్, గాదిగూడ మండలాల్లో ఇంకా కొంత లోటు ఉంది. మిగిలిన మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు అయింది. తాంసి, బజార్‌హత్నూర్ మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాత నమోదు అయింది. 20మిమీలకు పైగా భీంపూర్, సిరికొండ, నార్నూర్ మండలాల్లో వర్షం కురిసింది.