ఆదిలాబాద్ జిల్లాలో 467 పంచాయతీ ఉండగా.. 508 రెవెన్యూ గ్రామాలు.. మరో వందకు పైగా ఆవాసప్రాంతాలు ఉన్నాయి. జిల్లా మొత్తం జనాభా ఏడు లక్షలపైగా జనాభా ఉండగా.. వర్షాకాలంలో లక్షమంది జనాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంటోంది. వాగులు, వరదలు వచ్చినపుడు వారికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. అనారోగ్య సమస్యలు తలెత్తితే మాత్రం దేవుడిపై భారం వేయడం లేదంటే ప్రాణాలు పోగొట్టుకోవడం వంటి ఘటనలు ఏటా చోటు చేసుకుంటున్నాయి.
విపత్తు నిర్వహణ ప్రణాళికలో భాగంగా పంచాయతీరాజ్‌శాఖ విభాగం వారు 76 వాగుల వద్ద, ఆర్‌అండ్‌బీ శాఖ విభాగం వారు 26చోట్ల వాగులు ఉప్పొంగిపుడు రవాణా స్థంబిస్తుందని తమ నివేదికల్లో స్పష్టంచేశారు. ఆయా వాగుల వద్ద వరద ఉధ్ధృతి సమయంలో గంట, రెండు గంటలు .. మరి ఎక్కువైతే ఒకరోజు రాకపోకలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. అదే వాగుల ఉధ్ధృతి తగ్గకపోయినా.. వంతెనలు కోతకు గురైనా అక్కడ రాకపోకలకు నెలల తరబడి అవస్థలు తప్పని పరిస్థితి నెలకొంటోంది. లోతట్టు వంతెనల స్థానంలో పెద్ద వంతెనలు నిర్మించడం.. వంతెనలు లేని చోట ఆ సౌకర్యం కల్పించడం తప్పా తామేమి చేయలేమని అధికారులు చెబుతున్నారు.
అక్కడ వరదొస్తే.. అవస్థలే..
ఆదిలాబాద్ జిల్లాలో వాగులు, వంకలపై లోతట్టు వంతెనలు, కొన్నివాగులపై అసలే వంతెనలు లేని కారణంగా వరద వచ్చినపుడు రాకపోకలకు అవాంతరాలు తప్పడం లేదు. జిల్లాలోని 18 మండలాల్లోని ఆదిలాబాద్ అర్బన్, మావల మండలం మినహా మిగిలిన 16 మండలాల్లో ఆయా వాగులు ఉప్పొంగినపుడు జనజీవనం స్థంబిస్తోంది. జిల్లాలో ఆయా వాగుల కారణంగా లక్షమంది ఏదో ఒక సందర్భంలో అవస్థలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
ఆదిలాబాద్ నియోజకవర్గంలో..
ఆదిలాబాద్ గ్రామీణ మండలంలో బంగారుగూడ, అనుకుంట, లోకారి, దహిగూడ, కచ్‌కంటి, అంకాపూర్, జండాగూడ, టేకిడిగూడ, రాములుగూడ, యశ్వంత్‌గూడ, శివఘాట్, లోహర, ఖానాపూర్ గ్రామాల పరిసరప్రాంతాల వారు వాగులు ఉప్పొంగినపుడు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఆయా వాగులు పొంగినపుడు పదుల సంఖ్యలో గ్రామాలకు, వేలాది మందికి ఇక్కట్లు తప్పడంలేదు.
● బేల మండలం దుబ్బగూడ-ఎస్, టేమిరిగూడ, సహజ్‌తాండ, మణియర్‌పూర్, దహెగాం, జైనథ్ మండలం పార్డి-కె వాగులొస్తే ఇబ్బందులే.