10th Class students problems: ఇక్కడ కనిపించే వారంతా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం కరంజీ ఉన్నత పాఠశాల విద్యార్థులు. అదే మండలం అందర్ బంద్ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఒక రోజు ముందే ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. బస్సులు అందుబాటులో లేక రహదారి గుంతలమయం కావడంతో ముందస్తుగా అందర్ బంద్ చేరుకున్నారు. కరంజీ నుంచి 30 కిలోమీటర్లు దూరం రావడానికి వారికి గంటన్నర సమయం పట్టింది. అంటే రోడ్డు దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
"మా ఊరు రోడ్డు అస్సలు బాగోదు. వెళ్లి రావడానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. మరల రేపటి పరీక్షకు చదవడానికి ఇబ్బంది. అంతే కాదు మేము వచ్చే బండి ఎప్పుడు పంక్చర్ అవుతుందో తెలియని పరిస్థితి. అందుకే ఇంటి దగ్గర వస్తువులు తీసుకొని ఇక్కడికి వచ్చాం. పరీక్షలు ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉండి భోజనం చేసి ఇక్కడే చదువుకుంటాం. ఈ ఊరు సర్పంచ్ మాకు ఎంతో సహాయం చేశారు. ఆయనకు కృతజ్ఞతలు"- పదో తరగతి విద్యార్థిని
పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని వారం రోజుల ముందే తల్లిదండ్రులు అందర్ బంద్ గ్రామ సర్పంచిని కలిసి వసతి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మానవత్వంతో స్పందించిన సర్పంచ్.. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు వేర్వేరుగా ప్రత్యేక వసతి ఏర్పాటు చేశారు. సర్పంచ్ సహకారానికి విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
"మా ఊరు నుంచి ఇక్కడికి రావాలంటే చాలా కష్టం. మా పిల్లల కోసం నిత్యావసర సరుకులతో ఇక్కడికి వచ్చాం. ఇబ్బందిగా ఉన్నా.. మా పిల్లల చదువుల కోసం తప్పదు కదా".- విద్యార్థులు తల్లిదండ్రులు
ఐదేళ్ల క్రితం అందర్ బంద్ పాఠశాలకు పదో తరగతి పరీక్షా కేంద్రం వచ్చిందని ఇక్కడకి వచ్చే విద్యార్థులకు అన్ని విధాలా సహకారం అందిస్తున్నామని సర్పంచ్ కృష్ణ యాదవ్ తెలిపారు. కరంజీకి చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదనను దృష్టిలో ఉంచుకుని వసతి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నామంటున్న అధికారులు.. కరంజీ విద్యార్థుల కష్టాలకు ఏం సమాధానం చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.