ఆన్‌లైన్ విద్యను సద్వినియోగం చేసుకోవాలి : డీఈవో రవీందర్ రెడ్డి
కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా విద్యార్థులకు ఇంటి వద్దే విద్య అందించే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతులకు విద్యార్థులంతా హాజరు కావాలని, ఆన్‌లైన్ విద్యను ప్రతీ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి అన్నారు. గుడిహత్నూర్ర్ మండలంలోని మన్నూర్లో ఆయన పర్యటించి విద్యార్థులతో ముచ్చటించారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల పరిధిలోని మన్నూర్లో జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి పర్యటించారు. విద్యార్థులతో చాలాసేపు ముచ్చటించారు. సమయాన్ని వృథా చేయకూడదని, విద్యార్థులంతా ఇంటిపట్టున ఉంటూ.. ఆన్‌లైన్ విద్యను సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతులకు విద్యార్థులంతా హాజరు కావాలని సూచించారు. లాక్డౌన్ సమయంలో విద్యార్థులు చదువులో వెనకబడకుండా ఆన్‌లైన్ విద్య ఉపయోగపడుతుందని తెలిపారు. స్మార్ట్ఫోన్, టీవీలలో డిజిటల్ పాఠాలు వినాలని విద్యార్థులకు సూచించారు. ఆన్‌లైన్ పాఠాలు వినే క్రమంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా వీలైనంత వరకు ఉపాధ్యాయులు బాధ్యత వహించాలన్నారు. గ్రామాల్లో తిరిగి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలని ఆదేశించారు. డీఈవోతో పాటు.. ఈ పర్యటనలో ఎంఈవో నారాయణ, ఉపాధ్యాయులు ధర్మేందర్ సింగ్, నీల ఉన్నారు.