Adilabad Cement Factory : సిమెంటుకు డిమాండ్ ఏటేటా పెరుగుతోంది. కొన్నేళ్లుగా ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. ఈ అవకాశాలతో ప్రైవేటు కంపెనీలు లాభాలు ఆర్జిస్తుండగా.. ప్రభుత్వరంగ సంస్థ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చేతిలోని పరిశ్రమను కేంద్రం మూతపెట్టి, విక్రయించేందుకు సిద్ధపడుతోంది. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు నాడు వరంలా అందిన ఈ పరిశ్రమ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు అంగీకరించినా కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఆదివాసీ గిరిజన జిల్లా అభివృద్ధికి, 3 వేల మంది ఉపాధికి ఊతంలా నిలవాల్సిన పరిశ్రమ కథ ఇక ముగియబోతోంది.
లాభాల నుంచి...1989 వరకు ఈ పరిశ్రమ లాభాల బాటలో నడిచింది. ప్రతిరోజు 1200 టన్నుల మేర సిమెంట్ ఉత్పత్తి అయ్యేది. కేంద్రమే లెవీ కింద కొనుగోలు చేసి ప్రభుత్వ సంస్థలకు పంపిణీ చేసేది. 1991లో కేంద్ర ప్రభుత్వ నూతన ఆర్థిక విధానాల మేరకు.. ఈ కర్మాగారం నుంచి లెవీ సిమెంటు కొనుగోలును రద్దు చేసింది. స్వేచ్ఛా విపణికి వెళ్లాలని సూచించింది. ఆర్థిక ప్రోత్సాహకాల్ని నిలిపివేసింది. స్వేచ్ఛా విపణికి వెళ్లేందుకు ఆదిలాబాద్ యూనిట్‌కు అవకాశం లభించలేదు. సిమెంట్ విక్రయానికి టెండర్లలో పాల్గొన్నా.. ప్రైవేటు పోటీని తట్టుకోలేకపోయింది. చివరికి సిమెంట్ నిల్వలు భారీగా పెరిగి, నష్టాలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వం 1996లో పారిశ్రామిక, ఆర్థిక పునర్నిర్మాణ మండలి (బీఐఎఫ్‌ఆర్)కి అప్పగించింది. ఈ యూనిట్‌కు ఆర్థిక పరిపుష్టి కలిగించాలని బీఐఎఫ్‌ఆర్ సూచించినా కేంద్రం స్పందించలేదు. 2002లో మూసివేయాలని నిర్ణయించింది. 2008లో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం సంస్థలో కార్మికులెవరూ లేరు. యంత్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలిసి కర్మాగారాన్ని పునరుద్ధరించాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం యంత్రసామగ్రిని విక్రయించి, ఆ తర్వాత భూములు, గనులను అమ్మడానికి సిద్ధమవుతోంది.
దిక్కుతోచని భూనిర్వాసితులు :ఈ పరిశ్రమకు భూములిచ్చిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. నాడు దాదాపు వేయి మంది అతి తక్కువ ధరకు భూములు విక్రయించారు. ఇంటికో ఉద్యోగం అని అప్పట్లో కేంద్రం హామీ ఇచ్చినా సగం మందికే తక్కువ హోదా ఉద్యోగాలిచ్చింది. తీరా కర్మాగారం 20 ఏళ్లు కూడా సరిగా నడవకపోవడంతో వారికి వీఆర్‌ఎస్ ఇచ్చింది. దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం సీసీఐ వద్ద ఉన్న భూముల విలువ ఎకరా రూ.కోటికి పైనే ఉంది. ఆ భూములే ఉంటే తమకీ కష్టాలు ఉండేవి కావని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా తమ భూములు తమకు అప్పగించాలంటున్నారు. భూములను లీజుకు ఇచ్చిన 1200 మంది రైతులకూ లీజు సొమ్ము పూర్తిగా అందలేదు. లీజు రద్దు కానందున వాటిని కొనడానికీ ఎవరూ ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘‘ఒక ఆదివాసీ జిల్లాను ఆదుకోవడానికి బదులు.. బాధ్యతల నుంచి తప్పించుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. దీనిని అడ్డుకుంటాం’’ అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న చెప్పారు. న్యాయపోరాటం కొనసాగిస్తామని కార్మిక నేత విలాస్ తెలిపారు.