Railwayjobs cheating lady arrest in adilabad : ఎన్నో అలవెన్సులు, మరెన్నో సౌకర్యాలున్న కేంద్రప్రభుత్వ ఉద్యోగం వస్తుందంటే ఎవరూ వద్దంటారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న నిరుద్యోగుల అశను ఆసరాగా చేసుకున్న సదరు మహిళ మరో ముగ్గురుతో కలిసి.. రైల్వేలో ఉద్యోగాలంటూ నమ్మించింది. నిజమైన అపాయింట్మెంట్ లెటర్లలాగే.. తప్పుడు జాయినింగ్ లెటర్లు, ఫేక్ ఐడీలను సృష్టించి వారి నుంచి డబ్బును వసూలు చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 49 లక్షల రూపాయలను వసూలు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో నిరుద్యోగులకు వల వేసి రైల్వే ఉద్యోగుల పేరిట బురిడీ కొట్టించిన కిలాడీ లేడీని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆదిలాబాద్ పట్టణం బొక్కల్‌గూడకు చెందిన తోట రజిత రైల్వే ఉద్యోగాల పేరిట మోసం చేసిందని.. పది మంది అభ్యర్థులు పట్టణంలోని పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలించి మహిళను పట్టుకున్నారు. వీరు ముఠాగా ఉన్నారని.. ఇందులో శేషగిరిరావు, కబీర్‌సింగ్, మల్విందర్ సింగ్ వ్యక్తులున్నారని తెలిపారు. వీరు ఒక్కొక్క వ్యక్తి నుంచి నాలుగు నుంచి అయిదు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై హరిబాబు దర్యాప్తు చేసి సదరు మహిళ అరెస్టు చేయడంలో కీలక భూమిక పోషించారన్నారు.