ప్రసవం తర్వాత చంటిబిడ్డను తీసుకొని సంతోషంగా ఇంటికెళ్దామనుకున్న ఆ బాలింతకు అనుకోని ఘటన ఎదురైంది. తమ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయి బంధువుల ఇంట్లో తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. చిన్నపాటి వర్షం కురిసినా కొన్ని మారుమూల గ్రామాల్లో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఇక ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో ఇంటికి వెళ్లడానికి బాలింత పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు.
నిలిచిన రాకపోకలు
ఆదిలాబాద్ జిల్లా గిర్జాయ్ గ్రామానికి చెందిన సత్తు బాయి ప్రసవం కోసం వారం రోజుల క్రితం బజార్హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. సాధారణ ప్రసవంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. చంటిబిడ్డను తీసుకొని ఇంటికి వెళ్దామనుకున్న సమయంలో రాకపోకలు నిలిచిపోయాయి.
వాగు దాటితేనే..
ఆస్పత్రి నుంచి బయల్దేరిన వారు... జోరువాన కురవడంతో అదే మండలంలోని భూతయి గ్రామంలో వారి బంధువుల ఇంటివద్ద తలదాచుకున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం ఇంటికి బయల్దేరారు. అయితే వాన తగ్గినా బురద రోడ్లు ప్రమాదకరంగా ఉన్నాయని బాలింత ఆవేదన వ్యక్తం చేశారు. నానా అవస్థలు పడి వాగు దాటి ఇల్లు చేరినట్లు వివరించారు. మరో మూడు అనుబంధ గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని వాపోయారు.
'వర్షం కారణంగా ప్రసవం తర్వాత బాలింతని, చంటిబిడ్డను ఇంటికి తీసుకొని రాలేకపోయాం. వాన తగ్గిన తర్వాత వచ్చినా బురద రోడ్డుతో చాలా ఇబ్బందులు పడ్డాం. చంటిబిడ్డతో బాలింత వాగు దాటాల్సి వచ్చింది. అందరం కలిసి ఆమెను జాగ్రత్తగా తీసుకువచ్చాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం.