negligence of duties : సరిగ్గా ఏడాది కిందట అంటే జూన్- జులై నెలలో ఆయన ఓ శాఖకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారిగా నియమితులు కావడమే అత్యంత ఖరీదైన అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉమ్మడి జిల్లాలో ఓ కీలకమైన ప్రజాప్రతినిధి సహా మరో నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధిని ప్రసన్నం చేసుకొని పోస్టును దక్కించుకోవడం ఆశాఖ అధికారవర్గీయులతోపాటు ప్రజాప్రతినిధుల్లో చర్చనీయాంశమైంది. రూ.కోట్లాది వ్యయం చేసే పనుల కేటాయింపుల్లో ఆయనదే పైచేయి. జిల్లాలవారీగా ప్రజా అవసరాలరీత్యా సమన్యాయాన్ని పాటించకపోవడం, పనులను పర్యవేక్షించకపోవడంతో పాటు తన బదిలీకి సహకరించిన ఇద్దరు నేతల కనుసన్నల్లోనే ఆ అధికారి పావులు కదుపుతున్నారనే అభిప్రాయం వ్యక్తం కావడం మిగిలిన ప్రజాప్రతినిధులకు మింగుడుపడటంలేదు. ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు సబ్ డివిజన్ అధికారులకు ఇచ్చిన ప్రాధాన్యత మిగిలినవారికి ఇవ్వరనే ఆరోపణ సైతం ఆశాఖలో బలంగా నాటుకుంది.
దారిలో పెట్టాల్సింది పోయి.. దారి తప్పారు
కీలక అధికారిక హోదాకావడంతో ఎవరూ పెద్దగా నోరుమెదపడానికి ఇష్టపడకపోవడం ఆయనకు కలిసి వస్తోంది. వాస్తవంగా ఆయన విధులు నిర్వహించే అధికారిక ప్రధాన కేంద్రం (హెడ్ క్వాటర్) ఆదిలాబాద్. బాధ్యతల నిర్వహణలో భాగంగా మిగిలిన నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలో జరిగే రూ.వందల కోట్ల పనుల తీరును పర్యవేక్షణ చేయాలి. డివిజన్, సబ్ డివిజన్ స్థాయి సిబ్బంది పొరపాటు చేస్తే ‘దారి’లో పెట్టాల్సిందిపోయి తానే దారితప్పడం విమర్శలకు తావిస్తోంది.
మీటింగ్ల్లోనూ కనిపించరు
higher officer doesn't attend duties : శాఖాపరంగా హైదరాబాద్‌లో జరిగే సమావేశాలకు, ఉమ్మడి జిల్లాల్లో జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు హాజరుకావాల్సి ఉంది. హైదరాబాద్‌లో ఉండటానికి ఇష్టపడే ఆయన అక్కడ ఉన్నతాధికారుల సమావేశాలకు తప్పితే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు హాజరైన సందర్భాలే లేవు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి తరుచూ గైర్హాజరవుతూ తనకు బదులు కిందిస్థాయి అధికారులను పంపిస్తున్నారనే ఆరోపణపై సమావేశంలోనే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఫలితంలేకుండా పోయింది.