55 Yrs old Woman attends SSC Exam: మనిషిని విజ్ఞానవంతుడిగా చేసేది విద్య. కానీ కొన్ని దశాబ్దాల క్రితం కుటుంబ పరిస్థితులు, అప్పటి సామాజిక స్థితిగతుల కారణంగా స్త్రీలు చదువుకు దూరమయ్యారు. మరి ఇప్పుడేమో లక్షల రూపాయలు ఖర్చుచేసి మరీ తమ పిల్లల్ని తల్లిదండ్రులు చదివిస్తున్నారు. ఏ వయసులో చేయాల్సిన పనులు అప్పుడేే చేయాలనేది పెద్దల మాట. కానీ నాడు చదువుకు దూరమైన వారు.. మనవలు, మనవరాళ్లను ఎత్తుకునే దశలోనూ కొందరు విద్యలో రాణిస్తున్నారు. అలాంటి వారిని చూసినప్పుడు వయస్సుతో చదువుకు సంబంధం లేదని అనిపిస్తోంది.
55 Yrs old Woman attends SSC Exam in Adilabad : తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో సంఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఆమె ఒక ప్రజాప్రతినిధి. మనవళ్లు, మనవరాళ్లతో సరదాగా గడపాల్సిన వయసులో చదువుపై అమెకున్న శ్రద్ధ పదో తరగతి పరీక్ష రాసేలా చేసింది. అసలు ఈ వయసులో ఆమెకు చదువుకోవాలనే కోరిక ఎందుకు కలిగిందంటే..?
సాధారణ విద్యార్థిలా ప్యాడుతో వచ్చి పరీక్ష: ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌కు చెందిన చిలక పద్మ వార్డు సభ్యురాలుగా ఉన్నారు. వయసు 55 ఏళ్లు. ఆమె గతంలో ఏడో తరగతి చదివారు. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల ఆమె చదువు అక్కడితోనే ఆగిపోయింది. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు.. ఇక అలా జీవితం సాగిపోయింది. అయితే పద్మ తన చదువు ఏడో తరగతితోనే ఆగిపోవాలని అనుకోలేదు. పదో తరగతిలో ఉత్తీర్ణులు కావాలని భావించారు. దానికి తగ్గట్టుగా కఠోర శ్రమతో పదో తరగతి పరీక్షకు సన్నద్ధమయ్యారు.
మంగళవారం రోజున ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రంగా ప్రారంభమైన ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షకు ఆమె హాజరయ్యారు. సాధారణ విద్యార్థిలా ప్యాడుతో వచ్చి పరీక్ష రాశారు. ఈ సందర్భంగా భర్త చిన్నన్నతో పాటు మనవడు పరీక్ష కేంద్రానికి రావడం ఆసక్తి రేకెత్తించింది. పరీక్ష పూర్తి కాగానే.. బాగా రాశానంటూ వారితో పద్మ తన ఆనందాన్ని పంచుకున్నారు.