10th Class Answer Sheets Lost in Adilabad Update : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో కనిపించకుండా పోయిన... పదో తరగతి తెలుగు పరీక్ష సమాధాన పత్రాల కట్ట కోసం పోలీసులు గాలిస్తున్నారు. 11 జవాబు పత్రాల కట్టల్ని స్థానిక తపాలా కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మూల్యంకన కేంద్రానికి తీసుకెళ్తుండగా… ఒక కట్ట ఎక్కడో పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఎంత వెతికినా దొరకకపోవడంతో... పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా, డీఈఓ ప్రణీత సహా పోలీసులు.... తపాలా శాఖ అధికారులతో సమావేశమయ్యారు.
దొరకని జవాబు పత్రాల కట్ట ఆచూకీ : జవాబు పత్రాల కట్ట ఎక్కడ పడిపోయి ఉంటుందని ఆరా తీశారు. ఉట్నూరులోని ప్రధాన వీధుల్లో గాలించారు. జవాబు పత్రాల కట్ట ఇంకా దొరకలేదు. ఇంత జరిగినా... అధికారుల తీరు మారలేదు. మరోవైపు తపాలా శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే జవాబు పత్రాల కట్ట మాయమైందని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అయినా రెండో రోజు మంగళవారం కూడా జవాబు పత్రాల కట్టను ఆటోలోనే బస్టాండ్ వరకు తరలించారు. అనంతరం అక్కడ నుంచి బస్సులో మంచిర్యాలకు జవాబు పత్రాలను తీసుకెళ్లారు. నిన్న ఘటన తర్వాత కూడా అధికారులు అలాగే వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది.
తపాలా శాఖలో ఇద్దరు సిబ్బందిపై చర్యలు : విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా అధికారులు ఇప్పటికైనా జవాబు పత్రాలు తరలించడంలో నిర్లక్ష్యం వహించకుండా.. ప్రత్యేక చొరవ తీసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అటు.. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు తపాలా శాఖ ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఎంటీఎస్ రజిత, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నాగరాజుపై వేటు వేశారు.