ఒకప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను ఆసుపత్రులకు తరలించడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారు. సకాలంలో వైద్యం అందక ప్రాణాలు వదిలిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రారంభమైన 108 వాహనాలు ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకున్న వారికి అత్యవసర వైద్య సేవలు అందిస్తూ ఆపద్బాంధువుగా నిలిచాయి. ఇప్పుడు అదనంగా కరోనా మహమ్మారి బారిన పడినవారిని ఆసుపత్రులకు తరలిస్తూ ఆదర్శ సేవలు అందిస్తున్నాయి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 108 వాహన సిబ్బంది తామున్నమంటూ ప్రజల్లో భరోసా నింపుతున్నారు.
ఎలాంటి ప్రమాదం జరిగినా, అనారోగ్య సమస్య తలెత్తినా 108 టోల్ ఫ్రీ నెంబరు ఉందనే భరోసా ప్రజల్లో ఉంది. నిమిషాల్లో 108 సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకొని బాధితులకు అంబులెన్స్‌లో ప్రథమ చికిత్స అందిస్తూ ఆసుపత్రికి చేర్చి వారి ప్రాణాలను కాపాడుతున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో వారి సేవలు మరింత విస్తృతమయ్యాయి. కరోనా లక్షణాలు, అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.
అత్యవసర సమయంలో సాధారణ ప్రసవాలు చేస్తూ..
గర్భిణులను ఆసుపత్రికి తరలించే సమయంలో అత్యవసర పరిస్థితుల్లో వాహనంలోనే 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్ (ఈఎంటీ)లు సాధారణ ప్రసవాలు చేస్తున్నారు. ఆనంతరం ఆసుపత్రికి తరలిస్తున్నారు. పురిటినొప్పులతో ఉన్న వారిని గుర్తించి హైదరాబాద్‌లోని జీవీకే ఈఎంఆర్‌ఐ కార్యాలయంలోని కాల్‌సెంటర్‌లో ఉండే వైద్యుల సలహాలు చరవాణి(సెల్‌ఫోన్) ద్వారా తెలుసుకుంటూ వీటిని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఈఎంటీలకు హైదరాబాద్‌లో సంస్థ 45 రోజుల పాటు శిక్షణ ఇస్తోంది. విద్యార్హతలు డిగ్రీ వరకే ఉన్నా వైద్యులతో సమానంగా ప్రసవాలు చేయడంలో ప్రత్యేకత చాటుతున్నారు.
- ప్రపంచం కరోనా మహమ్మారికి భయాందోళనకు గురవుతున్న వేళ ఇటీవల నల్గొండ జిల్లాలో కొవిడ్ పాజిటివ్ ఉన్న గర్భిణిని ఆసుపత్రికి వాహనంలో తరలిస్తుండగా 108 సిబ్బంది సాధారణ ప్రసవం చేసి అందరి మన్ననలను అందుకున్నారు.