టోక్యో ఒలింపిక్స్‌లో (Tokyo Olympics) రెండు వారాలుగా ఉత్కంఠభరిత క్రీడలను చూశాం. ఈ విశ్వక్రీడల వేదికగా ఎంతో మంది క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకొని పతకాలను సాధించగా.. మరికొంత మంది ఆటతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. అయితే వీరితో చాలా తక్కువ మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పతకాలతో పాటు ప్రపంచ రికార్డులను తమ పేరుతో లిఖించుకున్నారు. పురుషుల 100 మీ. బటర్‌ఫ్లై స్విమ్మింగ్‌లో కాలేబ్ డ్రెస్సెల్ నుంచి.. మహిళల 400 మీ. హార్డిల్స్‌లో మెక్లాగ్లిన్ వరకు ఎంతోమంది క్రీడాకారులు ఈ వేదిక ద్వారా చరిత్రకెక్కారు. అలా టోక్యో ఒలింపిక్స్‌లో నమోదైన సరికొత్త ప్రపంచ రికార్డులు ఏవో తెలుసుకుందాం.
మహిళల ట్రాక్ సైక్లింగ్ టీమ్ ఈవెంట్లో జర్మనీ ప్రపంచ రికార్డు:
జర్మనీకి చెందిన మహిళల ట్రాక్ సైక్లింగ్ టీమ్.. టోక్యో ఒలింపిక్స్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఫ్రాంజిస్కా బ్రౌసే(Franziska Brausse), లీసా బ్రెన్నౌర్(Lisa Brennauer), లీసా క్లెయిన్(Lisa Klein), మైక్ క్రోజెర్(Mieke Kroeger).. కలిసి ఈ ఘనతను సాధించారు. ఈ ట్రాక్‌లో ఉన్న ప్రపంచ రికార్డును(4:06.166) రెండు సెకన్లు ముందుగా అంటే 4:04.242 సమయంలో ఈ రేసును పూర్తి చేసి స్వర్ణ పతకం సాధించారు. ఈ పోటీలో ఇప్పుడిదే రికార్డు!
పురుషుల సైక్లింగ్ పర్స్యూట్ ఫైనల్లో ఇటలీ టీమ్ సరికొత్త రికార్డు:
సైక్లింగ్ పర్స్యూట్ ఈవెంట్లో ఇటలీ పురుషుల జట్టు(Italian pursuit team) ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 3:42.032 సమయంలో రేసును పూర్తి చేసి విజేతగా నిలిచింది. 61 ఏళ్లగా ఈ ఈవెంట్లో ఇటలీకి ఇదే తొలి స్వర్ణం.
200 మీ. బ్రెస్ట్ స్ట్రోక్ ఈవెంట్లో మహిళా స్విమ్మర్ రికార్డు:
దక్షిణాఫ్రికాకు చెందిన మహిళా స్విమ్మర్ తజన స్కోన్ మేకర్(Tatjana Schoenmaker).. ఒలింపిక్స్ 200 మీ. బ్రెస్ట్ స్ట్రోక్ ఈవెంట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అంతకుముందు ఈ రికార్డు డెన్మార్క్‌కు చెందిన రిక్కే మోల్లెర్ పెడెర్సెన్(2:19.11) పేరిట ఉండగా.. ఇప్పుడా రికార్డు తజన స్కోన్ మేకర్(2:18.95) సొంతం చేసుకుంది.1996 తర్వాత దక్షిణాఫ్రికాకు స్వర్ణ పతకం సాధించిన తొలి స్విమ్మర్‌గా స్కోన్ ఘనత సాధించింది.
100 మీ. బటర్‌ఫ్లై ఈవెంట్లో అమెరికా స్విమ్మర్ వరల్డ్ రికార్డు:
భారీ అంచనాలతో టోక్యోలో అడుగుపెట్టిన అమెరికన్ స్విమ్మర్ డ్రెసెల్(Caeleb Dressel).. ఒలింపిక్స్‌లో సరికొత్త రికార్డును నమోదు చేశాడు. పురుషుల 100 మీ. బటర్‌ఫ్లై ఈవెంట్ ఫైనల్లో 49.45 సెకన్లలో రేసును పూర్తి చేసి.. ప్రపంచ రికార్డుతో స్వర్ణం గెలుచుకున్నాడు. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో అతనే నెలకొల్పిన రికార్డును (49.50సె) ఇప్పుడు మెరుగుపర్చుకున్నాడు.
4x100 మీ. మెడ్లీ రిలే పోటీల్లో అమెరికా టీమ్ రికార్డు:
4x100 మీటర్ల మెడ్లే రిలే ఈవెంట్లో అమెరికా టీమ్ విజేతగా నిలిచింది. ఈ పోటీని ర్యాన్ మర్ఫీ(Ryan Murphy), మైకేల్ ఆండ్రూ(Michael Andrew), కెలెబ్ డ్రెస్సెల్(Caeleb Dressel), జాక్ యాపిల్(Zach Apple) బృందం కేవలం 3:26.78 సమయంలో పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పి.. తమ దేశానికి బంగారు పతకాన్ని సాధించి పెట్టారు.
మహిళల స్పీడ్ క్లైంబింగ్లో అలెక్జాండ్రా మిరోస్లా ప్రపంచ రికార్డు:
పోలాండ్‌కు చెందిన అలెక్సాండ్రా మిరోస్లా(Aleksandra Mirosław).. టోక్యో ఒలింపిక్స్ వేదికగా మహిళల స్పీడ్ క్లైంబింగ్లో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 15 మీటర్ల ఎత్తును 6.84 సెకన్లలో స్పీడ్ క్లైంబ్ చేసి.. ఈ ఘనత సాధించింది. అంతకు ముందు ఈ రికార్డు రష్యాకు చెందిన ఇయులియా కల్పినా(6.96 సెకన్లు) పేరుతో ఉంది.
వెయిట్‌లిఫ్టింగ్‌లో జార్జియా క్రీడాకారుడు రికార్డు:
జార్జియాకు చెందిన లాషా తలఖడే (Lasha Talakhadze).. అంతకుముందు తన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును తానే అధిగమించాడు. వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్లో మొత్తంగా 488 కేజీల బరువునెత్తాడు. స్నాచ్ రౌండ్లో 223 కేజీలు.. క్లీన్ అండ్ జెర్క్ రౌండ్లో 265 కేజీల బరువు ఎత్తి, రెండు విభాగాల్లోనూ వరల్డ్ రికార్డును నమోదు చేశాడు. వివిధ క్రీడల్లో బంగారు పతకాలను సాధించిన తొలి జార్జియా క్రీడాకారుడిగా లాషా తలఖడే నిలిచాడు.