ఐదేళ్ల కిందట.. రియోలో.. ఒకటి.. రెండు.. మూడు.. అనుకుంటూ రోజులు లెక్క పెట్టుకుంటూ నైరాశ్యంతో భారంగా అడుగులు వేస్తున్న వేళ.. పన్నెండు రోజులు గడిచాక కానీ పతక కరవు తీరలేదు. అప్పుడు దేశం ఆశల్ని నిలబెట్టింది ఇద్దరమ్మాయిలు. రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్యం గెలిచి హమ్మయ్య అనిపిస్తే.. షట్లర్ సింధు రజతం సాధించి ఆనందాన్ని రెట్టింపు చేసింది. అప్పుడే కాదు.. ఇప్పుడు టోక్యోలోనూ..
భారతావని ఆశలను నిలబెడుతున్నది.. పతకాశలు రేపుతున్నది.. పతకాలు పట్టుకొస్తున్నది కూడా అమ్మాయిలే. తొలి రోజే వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను 135 కోట్లమంది భారతీయుల ఆశల్ని మోస్తూ రజతం సాధిస్తే.. ఇప్పుడు బాక్సర్ లవ్లీనా 'పతక' పంచ్ విసిరింది. సింధు మరోసారి తన రాకెట్ వేగాన్ని చూపిస్తూ పతకం దిశగా అడుగులేస్తోంది.