ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించే దేశాల్లో రష్యా ముందువరుసలో ఉంటుంది. అంతర్జాతీయ పోటీల్లో తమకు ఎదురులేదని ప్రతిసారి నిరూపిస్తుంటుంది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) పాల్గొంటున్న దేశాల జాబితాలో రష్యా పేరు కనిపించలేదు. ఎందుకంటే ఒలింపిక్స్‌లో ఆడకుండా రష్యాపై నిషేధముంది. అయితే మాత్రం ఒలింపిక్స్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే రష్యా ఈ పోటీల్లో పాల్గొనకుండా ఊరుకుంటుందా..! మరో మార్గంలో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది. 'ఆర్వోసీ' పేరుతో ఆ దేశ క్రీడాకారులు విశ్వక్రీడల్లో పాల్గొనేలా చేసింది.
నిషేధం ఎందుకు?
అథ్లెట్లకు నిర్వహించే డోపింగ్ పరీక్షలకు సంబంధించి రష్యా అవకతవకలకు పాల్పడిందని 2014 నుంచి ఆరోపణలు వస్తున్నాయి. విచారణ జరిపిన వరల్డ్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ(వాడా).. 2015లో రష్యాలో యాంటీ డోపింగ్ ల్యాబ్‌ను మూసివేసింది. వంద మంది క్రీడాకారుల్ని క్రీడల్లో పాల్గొనకుండా డిబార్ చేసింది. డోపింగ్ పరీక్షలకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చిందన్న కారణంగా 2019 డిసెంబర్లో రష్యాపై నాలుగేళ్లు నిషేధం విధిస్తున్నట్లు వాడా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఒలింపిక్స్, ఫిఫా వరల్డ్ కప్-2022, సహా అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి రష్యాకు వీలు లేకుండా పోయింది. దీంతో ఒలింపిక్స్‌లో పాల్గొనడం కోసం కఠోర శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఆందోళనకు గురయ్యారు. అయితే, వాడా నిర్ణయంపై అప్పీలు చేసుకునే అవకాశాన్ని రష్యా ఉపయోగించుకుంది.
ఒలింపిక్స్‌లో పాల్గొనవచ్చు.. కానీ!
ఈ విషయంపై కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(కాస్) విచారణ చేపట్టి.. వాడా విధించిన నాలుగేళ్ల నిషేధాన్ని రెండేళ్లకు తగ్గించింది. అంటే రష్యాపై నిషేధం 2022 డిసెంబర్ వరకే ఉంటుంది. కానీ ఒలింపిక్స్ 2020(కరోనా కారణంగా ఈ క్రీడలు 2021లో జరుగుతున్నాయి)లో పాల్గొనే అవకాశం లేక అథ్లెట్లు నష్టపోతారు. అందుకే, డోపింగ్ కుంభకోణంతో సంబంధంలేని క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకోవడానికి అవకాశం కల్పించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో కొన్ని షరతులతో టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి కాస్ వెసులుబాటు ఇచ్చింది. రష్యా నుంచి ఒలింపిక్స్‌కు అర్హత పొందే క్రీడాకారులు అక్కడ రష్యా దేశం పేరు, జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని వాడకూడదని స్పష్టం చేసింది.