టోక్యో ఒలింపిక్స్ సంబరాల్లో మునిగి తేలాక రెండు వారాలు విరామం తీసుకున్న క్రీడాభిమానుల కోసం ఇంకో ఆటల పండుగ వచ్చేసింది. టోక్యోలో మరో విశ్వ క్రీడాసంబంరం మొదలైంది. 16వ పారాలింపిక్స్ వేడుకలు(Tokyo Para Olympics opening ceremony) టోక్యో ప్రధాన స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగాయి.
కనులపండుగగా భారత జట్టు
ఆరంభ వేడుకల్లో భారత జట్టును ముందుండి నడిపించాడు జావెలిన్ త్రోవర్ టెక్ చంద్. విశ్వక్రీడా వేదికపై మువ్వన్నెల జెండాను చూసి ప్రేక్షకులు మురిసిపోయారు.
వైకల్యం శరీరానికే కాని.. తమ సంకల్పానికి కాదని చాటుతూ ప్రపంచం నలుమూలల నుంచి 4500 మంది పారా అథ్లెట్లు తమ సత్తా చాటడానికి టోక్యోలో సిద్ధంగా ఉన్నారు. అందులో భారత యోధులు 54 మంది. పారాలింపిక్స్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత పెద్ద జట్టుతో, భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న భారత బృందం.. రెండంకెల సంఖ్యలో పతకాలను లక్ష్యంగా పెట్టుకుంది.