దేశానికి ఒలింపిక్ పతకం సాధించాలనే లక్ష్యంతో బయలుదేరిన చెల్లికి.. అక్క మరణ వార్త అడ్డు కాకూడదని కుటుంబ సభ్యులు ఆ విషయం దాచి ఉంచారు. పోటీలు ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చాక విషయం తెలుసుకొన్న క్రీడాకారిణి విమానాశ్రయంలోనే కన్నీరు పెట్టుకొంది.
Tokyo olympics: మరణ వార్త దాచి.. ఒలింపిక్స్‌కు పంపారు - అథ్లెట్ ధన లక్ష్మీ అక్క మృతి
దేశానికి ఒలింపిక్ పతకం అందించాలనే లక్ష్యంతో టోక్యో వెళ్లిన చెల్లికి.. అక్క మరణ వార్త అడ్డు కాకూడదని అనుకున్నారు కుటుంబ సభ్యులు. అందుకే ఆ విషయాన్ని దాచి ఉంచారు. అథ్లెట్ ధనలక్ష్మికి ఎదురైన హృదయ విదారక ఘటన ఇది.
తిరుచ్చి జిల్లా గుండూర్‌కు చెందిన ధనలక్ష్మిశేఖర్ ఒలింపిక్స్‌లో 4x400 మిక్స్‌డ్ డబుల్స్ పోటీల్లో పాల్గొంది. జులై 12న ధనలక్ష్మి అక్క మరణించింది. అప్పటికే టోక్యో వెళ్లేందుకు మిగతా బృంద సభ్యులను కలవడానికి ధనలక్ష్మి పంజాబ్‌కు వెళ్లింది. ఆ సమయంలో అక్క మరణవార్త తెలిస్తే ఆమె ఏకాగ్రత దెబ్బతింటుందని భావించి కుటుంబ సభ్యులు ఆమెకు విషయం చెప్పలేదు. క్రీడలు ముగించుకుని శనివారం రాత్రి తిరుచ్చి విమానాశ్రయం చేరుకున్నాక అక్క మృతి ఆమెకు తెలిసింది. దీంతో ఆవేదన తట్టుకోలేక విమానాశ్రయంలోనే బోరున విలపించింది. బంధువులు, కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చి ఇంటికి తీసుకెళ్లారు.