ఒలింపిక్స్‌లో శనివారం భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. బాక్సింగ్ పురుషుల 52 కిలోల విభాగంలో.. ప్రపంచ నెం.1, టాప్ సీడ్ అమిత్ పంగాల్ అనూహ్య ఓటమితో విశ్వక్రీడల నుంచి నిష్క్రమించాడు. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, కొలంబియా బాక్సర్ యుబెర్జెన్ మార్టినెజ్ చేతిలో ప్రీక్వార్టర్ ఫైనల్లో 4-1తేడాతో ఓడిపోయాడు.
పంగాల్ను ప్రత్యర్థి ఉక్కిరిబిక్కిరి చేశాడు. పదే పదే పంచ్‌లు కురిపిస్తూ.. రింగ్ అంతా పరుగులు పెట్టించాడు. కొలంబియా బాక్సర్ దూకుడు ముందు.. భారత ఫేవరేట్ తేలిపోయాడు.
ఇటీవల భారత్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేసిన బాక్సర్లలో పంగాల్ ముందున్నాడు. 2018 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2019 ప్రపంచ ఛాంపియన్ షిప్లో రజతం సాధించాడు. కానీ.. తాను బరిలోకి దిగిన తొలి ఒలింపిక్స్‌లో మాత్రం పతకం లేకుండానే వైదొలిగాడు.
అయితే.. బాక్సింగ్‌లో ఇప్పటికే భారత్‌కు ఓ పతకం ఖాయమైంది. మహిళల 69 కిలోల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అందులో ఓడినా.. కాంస్యం దక్కుతుంది.
మరోవైపు.. మహిళల 75 కిలోల విభాగంలో పూజారాణి శనివారం, క్వార్టర్ ఫైనల్ ఆడనుంది. అందులో గెలిస్తే ఈమెకూ పతకం ఖాయమవుతుంది.
పురుషుల 91 కేజీల ప్లస్ విభాగంలో సతీశ్ కుమార్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
ఇదీ చూడండి: కండోమ్ సాయంతో ఒలింపిక్స్‌లో స్వర్ణం
పోరాడి ఓడిన అతాను..
ఆర్చరీలో భారత్ కథ ముగిసింది. పతకం తెస్తాడని ఆశలు పెట్టుకున్న అతాన్ దాస్.. ప్రీక్వార్టర్ ఫైనల్లో పోరాడి ఓడాడు. పురుషుల వ్యక్తిగత విభాగంలో జపాన్ ఆర్చర్ టకహరు ఫురుకవా చేతిలో 6-4 తేడాతో ఓటమి పాలై ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాడు.
ఐదు సెట్ల పోరు హోరాహోరీగా సాగింది. తొలి సెట్‌ను జపాన్ ఆర్చర్ గెల్చుకొని 2 పాయింట్లు సాధించగా.. రెండో సెట్ టై అయింది. దీంతో స్కోరు 3-1గా ఉంది. తర్వాతి సెట్‌ను కైవసం చేసుకొని స్కోరు 3-3తో సమం చేశాడు అతాను. నాలుగో సెట్ మళ్లీ టై అయింది. 4-4తో స్కోరు సమం అయింది. కీలకమైన చివరి సెట్లో అతాను దాస్ 9,8,9 స్కోరు చేయగా.. స్థానిక ప్లేయర్ 9,10, 8 చేసి ఒక్క పాయింట్ తేడాతో మ్యాచ్ గెల్చుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
ఇప్పటికే ఆర్చరీలో మిక్స్డ్ టీం విభాగం(దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్), మహిళల వ్యక్తిగత విభాగం(దీపికా కుమారి), పురుషుల వ్యక్తిగత విభాగంలో(తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్) ఓటమి పాలయ్యారు. చివరిగా ఆశలు రేపిన అతాను కూడా ఇప్పుడు ఓటమి చెంది ఆర్చరీలో రిక్తహస్తాలతో వైదొలగాల్సి వచ్చింది.