తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tokyo Olympics: భారత్​కు చివరిరోజు- 3 పతకాలపై ఆశలు - ఒలింపిక్ 2020 షెడ్యూల్

టోక్యో ఒలింపిక్స్​ చివరి రోజు ఆగస్టు 8 అయినప్పటికీ.. భారత్​ పోటీలు శనివారంతో ముగియనున్నాయి. మనదేశానికి మరో మూడు పతకాలు వచ్చే అవకాశముంది. శనివారం జరిగే పోటీల్లో పురుషుల జావెలిన్​ త్రో ఫైనల్లో నీరజ్​ చోప్రా ఆశలు కలిగిస్తుంటే.. రెజ్లింగ్​లో బజరంగ్​ పునియా కాంస్యం కోసం పోటీపడనున్నాడు. గోల్ఫ్​లో అదితి అశోక్​ చరిత్ర సృష్టించే అవకాశముంది. ఏ మ్యాచ్​ ఎప్పుడు జరగనుందంటే?

Tokyo Olympics 2020
టోక్యో ఒలింపిక్స్ 2020

By

Published : Aug 6, 2021, 9:25 PM IST

Updated : Aug 6, 2021, 10:28 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో 16వ రోజు భారత బృందానికి 3 పతకాలు వచ్చే అవకాశముంది. భారత్​కు ఈ ఒలింపిక్స్​లో శనివారమే చివరిరోజు. మొత్తం 3 పతకాంశాల్లో పోటీపడుతుండగా.. అన్నింటిపైనా ఆశలున్నాయి. అథ్లెటిక్స్​లో జావెలిన్​ త్రో ఫైనల్లో ప్లేయర్​ నీరజ్​ చోప్రా బరిలోకి దిగనుండగా.. రెజ్లింగ్​లో బజరంగ్​ పునియా కాంస్యం కోసం పోరాడనున్నాడు. గోల్ఫ్​లో అదితి అశోక్​కు కూడా రజతం లభించే అవకాశం ఉంది.

ఇప్పటికే భారత్​కు ఈ ఒలింపిక్స్​లో 5 పతకాలు (2 రజతాలు, 3 కాంస్యాలు) రాగా.. చివరిరోజు మరో రెండు పతకాలు సాధించినా విశ్వక్రీడల్లో మనదేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా మిగిలిపోతుంది. 2012 లండన్​ ఒలింపిక్స్​లో 6 పతకాలు సాధించడమే ఇప్పటివరకు భారత్​కు గొప్ప ప్రదర్శన. ఈసారి దానిని అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

శనివారం భారత అథ్లెట్ల షెడ్యూల్ ఇదే..

గోల్ఫ్​.. (రౌండ్​-4)

అదితి అశోక్

మహిళల వ్యక్తిగత స్ట్రోక్​ ప్లే రౌండ్​ 4 మ్యాచ్​ కోసం భారత్​ తరఫున అదితి అశోక్​, దీక్షా దగర్​ పాల్గొననున్నారు.

దీక్షా దగర్ ​ - ఉ. 4.17 గంటల నుంచి

అదితి అశోక్​ - ఉ. 4.48 గంటలకు నుంచి

ఈ మ్యాచ్​ కూడా శుక్రవారం జరగాల్సి ఉండగా, వాతవరణ సమస్యల కారణంగా శనివారానికి వాయిదా పడింది. ఒకవేళ రేపు కూడా మ్యాచ్​ జరిగే అవకాశం లేకపోతే ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న అదితికి రజతం లభిస్తుంది. తొలిసారి భారత్​కు గోల్ఫ్​లో పతకం సాధించిన అథ్లెట్​గా చరిత్ర సృష్టిస్తుంది.

శుక్రవారం జరిగిన రౌండ్​ 3 మ్యాచ్​లో రెండో స్థానంలో నిలిచిన అదితి.. ఈ ఈవెంట్​లో రజతం సాధించే అవకాశముంది. ప్రస్తుతం మూడు రౌండ్ల తర్వాత రెండో స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన నెల్లి కొర్డా మొదటి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా హన్నా గ్రీన్​, న్యూజిలాండ్​కు చెందిన లైడియా మూడో స్థానంలో ఉన్నారు.

రెజ్లింగ్​.. (కాంస్య పోరు)

బజరంగ్ పునియా

పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్​ విభాగం సెమీస్​లో ఓడిపోయిన బజరంగ్​ పునియా కాంస్యం కోసం పోరాడనున్నాడు. ఈ మ్యాచ్​ సాయంత్రం 3.15 గంటల తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అథ్లెటిక్స్​.. (జావెలిన్​ త్రో ఫైనల్​)

పురుషుల జావెలిన్​ త్రో క్వాలిఫికేషన్​ గ్రూప్​-ఏలో అదరగొట్టిన నీరజ్​ చోప్రా.. తొలి ప్రయత్నంలోనే ఫైనల్​కు ఎంపికయ్యాడు. ఈ ఒలింపిక్స్‌లో అతడు కచ్చితంగా పతకం గెలుస్తాడనే నమ్మకంతో ఉన్నారు క్రీడాభిమానులు. క్వాలిఫికేషన్ రౌండ్​లో జావెలిన్​ను ఏకంగా 86.59 మీ.(83 మీ. విసిరితే అర్హత) విసిరి ఆశ్చర్యపరిచాడు.

నీరజ్ చోప్రా

ఈ మ్యాచ్​ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోరుతో టోక్యో ఒలింపిక్స్​లో భారత పోటీలు ముగియనున్నాయి.

స్వర్ణం తీసుకురావాలి..

మానస్​ కుమార్ సైకతశిల్పం

నీరజ్​ చోప్రా ఫైనల్​ నేపథ్యంలో.. అతడు భారత్​కు స్వర్ణపతకం తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఒడిశాకు చెందిన మానస్​ కుమార్ సాహో అనే ఆర్టిస్ట్​ అతడికి మద్దతుగా బీచ్​లో సైకతశిల్పాన్ని రూపొందించాడు. యావత్​ భారతం స్వర్ణ పతకం కోసం ఎదురుచూస్తోందని, కచ్చితంగా పతకం తేవాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి:'ఈ ఓటమి గెలుపుతో సమానం.. వాళ్ల ఆట అద్భుతం'

Last Updated : Aug 6, 2021, 10:28 PM IST

ABOUT THE AUTHOR

...view details