టోక్యో ఒలింపిక్స్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఈ విశ్వక్రీడల్లో గురువారం(ఆగస్టు 5) అందుకున్న రెండు పతకాలతో కలిపి ఇప్పటివరకు ఐదు మెడల్స్ సాధించింది భారత్. ఇందులో రెండు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి. అయితే శుక్రవారం(ఆగస్టు 6, 14వ రోజు) జరిగే పోటీల్లో మరింత మంచి ప్రదర్శన చేసి పతకాల సంఖ్యను పెంచుకోవాలని పట్టుదలతో ఉంది.
కాంస్యం సాధిస్తారా?
ఒలింపిక్స్లో సెమీస్లో ఓడి చరిత్ర సృష్టించే అవకాశాన్ని పోగొట్టుకున్నా.. తమ వీరోచిత పోరాటంతో యావత్ దేశప్రజల మనసును దోచుకున్నాయి భారత పురుషుల, మహిళల హాకీ జట్లు. అయితే దేశానికి పతకం అందించాలన్న పట్టుదలతో కాంస్య పోరుకు సిద్ధమయ్యాయి. అనుకున్నట్లే.. పురుషుల జట్టు గురువారం జరిగిన మ్యాచ్లో జర్మనీపై అద్భుత ప్రదర్శన చేసి కాంస్యం సాధించింది. 41ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో భారత హాకీకి ఇదే తొలి పతకం. అలాగే మహిళల జట్టు కూడా శుక్రవారం జరిగే పోరులో గ్రేట్ బ్రిటన్ను ఎదుర్కొని సత్తా చాటాలని కసిగా ఉంది. కాగా, దేశానికి మహిళల హాకీలో తొలి ఒలింపిక్స్ పతకం అందించడానికి ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు ధీమా వ్యక్తం చేసింది కెప్టెన్ రాణిరాంపాల్. మరి ఈ ఉత్కంఠ పోరులో మన మహిళలు పతకాన్ని సాధించి దేశ ప్రజల అంచనాలను అందుకుంటారో లేదో చూడాలి.
మరోవైపు రెజ్లింగ్లో భజరంగ్ పునియాపై కూడా భారీ ఆశలే ఉన్నాయి. అతడు పతకం సాధిస్తాడని క్రీడాభిమానులు నమ్మకం పెట్టుకున్నారు.
ఆగస్టు 6న జరిగే క్రీడా వివరాలు ఇవే..
అథ్లెటిక్స్- అర్ధరాత్రి 2 గంటల నుంచి
పురుషుల 50 కి.మీ. రేస్ వాక్ ఫైనల్-- గురుప్రీత్ సింగ్
గోల్ఫ్- మహిళల రౌండ్-3(5.29 నుంచి)
అదితి అశోక్, దీక్ష దగర్