టోక్యో ఒలింపిక్స్‌లో 12వ రోజు(ఆగస్టు 4) భారత బృందానికి అంతగా కలిసిరాలేదు. ఎన్నో ఆశలతో సెమీస్‌లో బరిలో దిగిన మనోళ్లు బోల్తా పడ్డారు. కానీ ఓ పతకం ఖాయం అవ్వడం వల్ల క్రీడాభిమానులు కాస్త సంతృప్తిపడ్డారు. మొత్తంగా ఐదు ఈవెంట్లలో భారత అథ్లెట్లు పాల్గొన్నారు. హాకీ, బాక్సింగ్ సెమీస్‌లో చేతులెత్తేయగా.. జావెలిన్ త్రో, గోల్ఫ్, రెజ్లింగ్‌లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఓ సారి మన క్రీడాకారులు ఎలాంటి ప్రదర్శన చేశారో చూద్దాం..
పసిడి ఆశలు ఆవిరి
హాకీ ఇండియా.. సరికొత్త చరిత్రకు అడుగు దూరంలో మహిళల జట్టు బోల్తా పడింది. స్వర్ణమే లక్ష్యంగా ముందుకు సాగిన రాణి రాంపాల్ సేనకు సెమీస్‌లో అర్జెంటీనా చేతిలో భంగపాటు తప్పలేదు. 1-2తో ప్రత్యర్థి చేతిలో పరాజయం చవిచూసింది. కాంస్య పోరులో గ్రేట్ బ్రిటన్‌పై నెగ్గి పతకం సాధిస్తారో లేదో చూడాలి.
లవ్లీనా చరిత్ర సృష్టించింది కానీ..
భారత బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్(Lovlina Borgohain) ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. కానీ ఆమె స్వర్ణం సాధిస్తుందని అంతా ఆశపడ్డారు. బుధవారం జరిగిన సెమీస్‌లో 69కేజీల విభాగంలో ఆమె 0-5 తేడాతో ఓటమి పాలైంది. వరుసగా మూడు రౌండ్లలో సుర్మెనెలి ఆకట్టుకుంది. తొలి రౌండ్లో లవ్లీనా కొన్ని పంచులు బాగానే విసిరినప్పటికీ వాటిని ప్రత్యర్థి తన డిఫెన్స్‌తో అడ్డుకొంది. దాంతో 50-45తో సుర్మెనెలి మొదటి రౌండ్ గెలుచుకుంది. రెండో రౌండ్లో ఆమె మరింత రెచ్చిపోగా లవ్లీనా రక్షణాత్మక ధోరణి కనబరిచింది. చివరి రౌండ్లో ఆమె మరింత తేలిపోయింది. ఆఖరికి 30-26, 30-26, 30-25, 20-25, 30-25 టర్కీ బాక్సర్ ఘన విజయం అందుకుంది.